![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు.. తారక్, చరణ్ వంటి స్టార్స్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సినీ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలను నిరాశపరుస్తూ మూవీని మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్.
'ఆర్ఆర్ఆర్' సినిమాని ఎట్టి పరిస్తితుల్లో అక్టోబర్ 13 నే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మొన్నటివరకు మూవీ మేకర్స్ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఆ డేట్ కి ఆర్ఆర్ఆర్ విడుదలవడంపై ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఆ అనుమానాలను నిజం చేశారు. మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్ 21 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని.. అందుకే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ని ఇప్పుడే ప్రకటించట్లేదని.. ప్రపంచ సినిమా మార్కెట్ చక్కబడిన తర్వాత.. వీలయినంత త్వరగా మూవీని విడుదల చేస్తామని పేర్కొన్నారు.
'ఆర్ఆర్ఆర్' వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కాగా ఈ మూవీలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, ఆలియాభట్, ఒలీవియా మోరీస్, శ్రియ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
![]() |
![]() |