![]() |
![]() |

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. స్పోర్ట్స్ బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ స్కిడ్ అవడంతో కిందపడిన ఆయన స్పృహతప్పి పడిపోవడంతో, సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను వెంటనే హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్‌లో చేర్పించారు. తలకు దెబ్బలేవైనా తగిలాయేమోనని బ్రెయిన్ స్కాన్ తీయగా, నార్మల్ అని తేలినట్లు సమాచారం. అయితే ఛాతీపైన రెండు భుజాలను కలుపుతూ ఉండే క్లావికల్ బోన్ విరిగినట్లు ఎక్స్‌రేలో తేలింది.
ప్రాథమిక చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిసింది. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు. బైక్ ముందు భాగం ఒకవైపు బాగా డ్యామేజ్ అయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వెళుతుండగా కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ వద్ద సాయి తేజ్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. ప్రమాదం సమయంలో బైక్ అతి వేగంగా పోతుండటం వల్ల సాయి ధరమ్ తేజ్ కడుపు, ఛాతీపై గట్టి గాయాలయ్యాయి. కుడికన్ను పైన కూడా గీరుకుపోయింది.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక సాయితేజ్ అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్ సీఐ తెలిపారు.

![]() |
![]() |