![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. అలా.. బాలయ్య క్రియేట్ చేసిన సెన్సేషన్స్ లో `మంగమ్మ గారి మనవడు`కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. అప్పటివరకు తన తండ్రి, నటరత్న నందమూరి తారక రామారావు కాంబినేషన్ లోనే అఖండ విజయాలు చూసిన బాలయ్య.. సోలో హీరోగా ఈ సినిమాతోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజా రూపొందించిన తమిళ చిత్రం `మణ్ వాసనై` (పాండియన్, రేవతి) ఆధారంగా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలయ్యకి జంటగా సుహాసిని నటించగా.. మంగమ్మ పాత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి తనదైన అభినయంతో అలరించారు. ఇతర ముఖ్య పాత్రల్లో గొల్లపూడి, గోకిన రామారావు, అనిత, వై. విజయ కనిపించారు. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ చిత్రాన్ని `భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్` పతాకంపై ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``దంచవే మేనత్త కూతురా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``చందురుడు నిన్ను చూసి``, ``గుమ్మ చూపు``, ``వంగతోట కాడ``, ``శ్రీ సూర్యనారాయణ`` గీతాలు కూడా రంజిపజేశాయి. హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శితమైన `మంగమ్మ గారి మనవడు`.. తెలుగునాట పలు కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది. అలాగే కర్ణాటకలోనూ 100 రోజులు ఆడింది. భానుమతి పుట్టినరోజు కానుకగా 1984 సెప్టెంబర్ 7న విడుదలై సంచలన విజయం సాధించిన `మంగమ్మ గారి మనవడు`.. నేటితో 37 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |