![]() |
![]() |
.jpg)
'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్‌లో 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ సాకీ పాడిన దర్శనం మొగిలయ్య రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ఇంతదాకా ప్రజాదరణకు అంతగా నోచుకోని ఆయనను అందరూ కీర్తిస్తూ వస్తున్నారు. 12 మెట్ల కిన్నెరను వాయించే అరుదైన జానపద కళాకారుడైన మొగిలయ్య.. ఆ వాయిద్యం ఆకలి తీర్చకపోతున్నా, ఇంతదాకా దాన్ని వదలకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం వల్ల లబ్ధి పొంది, ఒక చిన్న ఇంటిని సమకూర్చుకున్నారు మొగిలయ్య.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. అయినప్పటికీ ఆర్థికంగా మొగిలయ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. తింటానికి సరైన తిండిలేక భార్య అనారోగ్యం బారినపడినప్పుడు కూడా ఆయన తన కిన్నెరను వదల్లేదు. మూడేళ్ల క్రితం హాస్పిటల్లోనే భార్య మృతి చెందింది. అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులేని స్థితి.
అప్పుడు ఏడుస్తూ, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారికి ఫోన్ చేశారు మొగిలయ్య. ఆపద్బాంధవుడిలా ఆయన అప్పటికప్పుడు పదివేల రూపాయలు పంపి ఆదుకున్నారు. ఆ డబ్బులతో భార్య పార్థివదేహాన్ని శ్మశానికి తీసుకుపోయి, దహనం చేశానని తెలుగువన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు మొగిలయ్య. ఆ తర్వాత తమ ఎమ్మెల్యే బాలరాజు ఐదు వేల రూపాయలు ఇస్తే, దాంతో బొందపెట్టుకున్నానని చెప్పారు. భార్య చనిపోయినా, తను చచ్చిపోయే పరిస్థితి వచ్చినా కిన్నెరను మాత్రం వదలననీ, అది తన తల్లి లాంటిదనీ ఆయన అన్నారు.
![]() |
![]() |