![]() |
![]() |
.jpg)
మెగాస్టార్ చిరంజీవికి కళాతపస్వి కె. విశ్వనాథ్ కాంబినేషన్ ఎంతో ప్రత్యేకం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో `శుభలేఖ` (1982), `స్వయంకృషి` (1987), `ఆపద్బాంధవుడు` (1992).. ఇలా ఐదేళ్ళకో సినిమా చొప్పున ముచ్చటగా మూడు చిత్రాలు రూపొందగా.. ఈ మూడు సినిమాలతోనూ `ఉత్తమ నటుడు`గా చిరు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. `శుభలేఖ`తో తొలి `ఫిల్మ్ ఫేర్` అవార్డు పొందిన మెగాస్టార్.. `స్వయంకృషి`తో మొదటి `నంది`ని అందుకున్నారు. `ఆపద్బాంధవుడు`తో అయితే ఈ రెండు పురస్కారాలను కూడా కైవసం చేసుకున్నారు. అలా.. కె. విశ్వనాథ్ కాంబినేషన్ చిరుకి సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఇక ఈ మూడు చిత్రాల్లోనూ అటు కళాత్మకంగానూ, ఇటు వాణిజ్యాత్మకంగానూ మెప్పించిన చిత్రం `స్వయంకృషి`.
చెప్పులు కొట్టే సాంబయ్య (చిరంజీవి) తన స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎలా ఎదిగాడు? అతని జీవితంలో గంగ (విజయశాంతి) పాత్ర ఏంటన్నదే? ఈ సినిమా. `పసివాడి ప్రాణం` వంటి సంచలన విజయం తరువాత 50 రోజుల్లోపే జనం ముందు నిలిచిన ఈ చిత్రంతో చిరు, విజయశాంతి జోడి మరో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకోవడం ఓ విశేషం. `పసివాడి ప్రాణం`లో అతిథి పాత్ర పోషించిన సుమలత.. ఇందులో ముఖ్య పాత్రలో కనిపించడం మరో విశేషం. పలు విదేశీ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమవడమే కాకుండా రష్యన్ భాషలోకి అనువదితమై అప్పట్లో వార్తల్లో నిలిచిందీ క్లాసిక్.
ఇక స్వరకర్త రమేశ్ నాయుడుకి ఇదే చివరి సినిమా కావడం.. ఆయన చనిపోయిన రోజే ఈ చిత్రం విడుదల కావడం బాధాకరం. పాటల విషయానికి వస్తే.. ఇందులోని గీతాలన్నీ ఆణిముత్యాలే. ``సిన్నీ సిన్నీ కోరికలడగా``, ``పారాహుషార్``, ``సిగ్గు పూబంతి``.. పాటలైతే ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. 1987 సెప్టెంబర్ 3న విడుదలై జననీరాజనాలు అందుకున్న `స్వయంకృషి`.. నేటితో 34 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |