![]() |
![]() |

`మదర్ ఇండియా`.. 1957లో హిందీనాట సంచలన విజయం సాధించిన ఎపిక్ డ్రామా. భర్త చనిపోయి ఇద్దరు కొడుకులతో ఉన్న ఓ ఒంటరి మహిళ తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా ఎదుర్కొందన్నదే ఈ చిత్ర కథాంశం. నర్గీస్, సునీల్ దత్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్.. ఆల్ టైమ్ ఇండియన్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా భారతదేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయిన తొలి సినిమాగానూ చరిత్రలోకెక్కింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (హిందీ)గా నేషనల్ అవార్డ్ ని సైతం అందుకున్న ఈ బ్లాక్ బస్టర్.. పలు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ని కూడా కొల్లగొట్టింది.
అలాంటి `మదర్ ఇండియా`కి తెలుగు వెర్షన్ కి రూపొందిన సినిమా `బంగారు తల్లి`. జమున టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య భర్త పాత్రలో నటించగా శోభన్ బాబు, కృష్ణంరాజు కొడుకుల పాత్రల్లో అలరించారు. నాగభూషణం, అల్లు రామలింగయ్య, వెన్నిరాడై నిర్మల, రమా ప్రభ, నిర్మల, బేబి శ్రీదేవి, సాక్షి రంగారావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ సంస్థ నిర్మించగా.. ఎస్. రాజేశ్వరరావు సంగీతమందించారు. 1971 సెప్టెంబర్ 3న విడుదలైన `బంగారు తల్లి`.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |