Home  »  News  »  నూటొక్క జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

Updated : Sep 3, 2021

సినిమా పేరు: నూటొక్క జిల్లాల అందగాడు
తారాగణం: అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ, రోహిణి, అభిషేక్ మహర్షి తదితరులు
కథ: అవసరాల శ్రీనివాస్
కూర్పు: రామ్ 
ఛాయాగ్రహణం: కిరణ్ గంటి 
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సమర్పణ: 'దిల్' రాజు, క్రిష్ జాగర్లమూడి 
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
విడుదల తేదీ: 03 సెప్టెంబర్ 2021

మతిమరుపు, అతి శుభ్రత, తన శరీరంలో ఓ భాగం చిన్నదని ఫీలవడం... తెలుగులో ఈమధ్య ఓ కాన్సెప్ట్ తీసుకుని దర్శక-రచయితలు కథలు అల్లుతున్నారు. సినిమాలు తీసి మెప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు అందరినీ నవ్విస్తున్నారు. చివర్లో సందేశం ఇస్తున్నారు. అదే కోవలో తీసిన సినిమా 'నూటొక్క జిల్లాల అందగాడు'. బట్టతల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. హిందీలో ఈ కాన్సెప్ట్ మీద 'బాలా', 'ఉజ్డా చమన్' సినిమాలు వచ్చాయి. అవసరాల శ్రీనివాస్ కథ అందించడంతో పాటు హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది?

కథ:

జీఎస్ఎన్‌ అలియాస్ గొత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్)కు బట్టతల. నలుగురిలోకి అలా వెళ్లడానికి నామోషీగా ఫీలయ్యి విగ్ పెట్టుకుంటాడు. అతడి ఆఫీసులో కొత్తగా చేరిన అంజలి (రుహని శర్మ)ని ఇష్టపడతాడు. ముందుగా అంజలి అతడికి ప్రపోజ్ చేస్తుంది. ఐలవ్యూ చెబుతుంది. అయితే, ఆమెకు అసలు విషయం తెలిసిన తర్వాత జీఎస్ఎన్‌ను దూరం పెడుతుంది. అప్పుడు జీఎస్ఎన్‌ ఏం చేశాడు? అంజలిలో ఎటువంటి మార్పు వచ్చింది? ఇతరుల కోసం, సమాజం కోసం జీఎస్ఎన్‌ జీవించాలని అనుకున్నాడా? తన కోసం జీవించాలని అనుకున్నాడా? అందానికి అతడు ఇచ్చిన నిర్వచనం ఏమిటి? అనేది మిగతా సినిమా   

విశ్లేషణ:

ప్రచార చిత్రాలు చూస్తే కథ ఏమిటన్నది సులభంగా ఊహించవచ్చు. కథ, కథాంశం చిన్నది అయినప్పుడు కథనంతో, కామెడీతో, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేయాలి. 'నూటొక్క జిల్లాల అందగాడు'లో కథనానికి పెద్దగా ఆస్కారం లేదు. హీరోది బట్టతల అని తెలిసిన తరవాత  హీరోయిన్ దూరం జరుగుతుందని అందరూ ఊహించేది. తెలిసే వరకూ, తెలిసిన తర్వాత తెరపై వచ్చే సన్నివేశాలను అవసరాల శ్రీనివాస్ బాగా రాశారు. వాటిలో బాగా నటించారు. ముఖ్యంగా అవసరాల శైలి సంభాషణలు నవ్విస్తాయి. అయితే, హీరోయిన్‌లో మార్పు వచ్చే సన్నివేశాల్లో బలం లోపించింది. అప్పటివరకూ హీరోని దూరం పెట్టిన అమ్మాయి, ఒక్క సన్నివేశంలో మారడం అంత కన్వీన్సింగ్ గా అనిపించలేదు. అదే విధంగా హీరోలో మార్పు వచ్చి తనను తానూ యాక్సెప్ట్ చేసే సన్నివేశాలు కూడా! సినిమాలో కామెడీ ఉన్నప్పటికీ... ఎమోషన్ మిస్ అయ్యింది. హీరో, అతడి తల్లి మధ్య... హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్లు ఇంకాస్త బావుండి ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాల్లో మరీ స్వేచ్ఛ తీసుకున్నారు. అవి సినిమాటిక్ గా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు. సంగీతం, సాహిత్యం, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు సినిమాకు ఎంత మేరకు అవసరమో, అంతవరకూ ఉంది.      

నటీనటుల పనితీరు:

అవసరాల శ్రీనివాస్ కామెడీ సన్నివేశాల్లో ఇరగదీశాడు. కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ నటుడిగా మెప్పించాడు. అయితే, ఎమోషన్స్ ఎక్కువ చూపించే స్కోప్ అతడికి దొరకలేదు. రుహని శర్మ సహజంగా నటించింది. రోహిణి నటించడం వల్ల తల్లి పాత్రకు హుందాతనం వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె కూడా అవలీలగా నటించారు. అభిషేక్ మహర్షి, రుద్ర ప్రతాప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 

తెలుగువన్‌ పర్‌స్పెక్టివ్‌:

'నూటొక్క జిల్లాల అందగాడు' డీసెంట్ కామెడీ ఫిల్మ్. అవసరాల శ్రీనివాస్ నటన, ఫస్టాఫ్ నవ్విస్తాయి. సెకండాఫ్ లో కొన్ని సీన్లు రిపీట్ చేసినట్టు ఉన్నాయి. బలమైన ఎమోషనల్ సన్నివేశాలు ఉండి ఉంటే బావుండేది. సిట్యువేషనల్ & బాడీ షేమింగ్ కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు సరదాగా ఒకసారి చూడవచ్చు. చివర్లో చిన్న సందేశం కూడా ఇచ్చారు.

రేటింగ్‌: 2.5/5 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.