![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వం' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల 'పొన్నియిన్ సెల్వన్' సినిమా షూటింగ్ జరిగింది. యుద్ధం సీన్ కోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో డీహైడ్రేషన్ కారణంగా ఓ గుర్రం చనిపోయింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. పెటా ఫిర్యాదు మేరకు మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, గుర్రం యజమానిపై పీసీఏ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఘటనపై గుర్రం యజమాని స్పందిస్తూ.. డీహైడ్రేడ్ అయిన గుర్రాల్ని షూటింగ్‌లో ఉపయోగించడం వల్లే గుర్రం చనిపోయిందని చెప్పారు. మరోవైపు పెటా ప్రతినిధులు మాట్లాడుతూ.. జంతువులను ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించాలనీ, మనకు టెక్నాలజీ అందుబాటులో ఉందని తెలిపారు.
కాగా, ప్రముఖ తమిళ రచయిత కల్కి వ్రాసిన నవల 'పోన్నియన్ సెల్వన్' ఆధారంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |