![]() |
![]() |

టాలీవుడ్ డ్రగ్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ నేడు ఆరంభమైంది. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలోని మూడో ఫ్లోర్‌లో మొదటగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈరోజు విచారిస్తున్నారు. పూరి తనతో పాటు కుమారుడు ఆకాశ్‌తో పాటు చార్టర్డ్ అకౌంటెంట్‌ను వెంటపెట్టుకొని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో అధికారులు ఉదయం 11 గంటల నుంచీ పూరీని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా తమ విచారణలో మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తున్నారని సమాచారం.
డ్రగ్స్ పెడ్లర్స్‌తో జరిపిన లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోలును ఎలా జరిపారన్న అంశాలపై ఈడీ అధికారులు కూపీ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణలో తనకు డ్రగ్స్‌తో కానీ, డ్రగ్స్ కొనుగోలుతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని పూరి స్పష్టం చేశారు. అయితే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంతోటే టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.
మీరు డ్రగ్స్ తీసుకున్నారా? ఎఫ్ క్లబ్ నుంచి మీకు డ్రగ్స్ అందాయా? డ్రగ్స్ కొనుగోలుకు నగదు లావాదేవీలు ఎలా జరిపారు? గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ మీకు తెలుసా, లేదా? డ్రగ్ స్మగ్లర్ల వాట్సాప్ చాటింగ్‌లో మీ సెల్ నంబర్ ఎందుకుంది? మీ అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో నగదును ఎందుకు వేరే అకౌంట్లకు బదిలీ చేయాల్సి వచ్చింది? తదితర ప్రశ్నలను ఈడీ అధికారులు పూరీపై సంధించినట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీలపై అభియోగాలు నిరూపణ అయితే చట్టప్రకారం ఈడీ చర్యలు తీసుకొనే అవకాశం ఉందంటున్నారు.
![]() |
![]() |