![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌ను అమాంతం అందలం ఎక్కించిన సినిమా 'గబ్బర్‌సింగ్'. సల్మాన్‌ఖాన్ హిందీ సినిమా 'దబాంగ్'కు రీమేక్‌గా హరీశ్ శంకర్ రూపొందించిన ఈ సినిమా మూడు వరుస ఫ్లాపుల తర్వాత కల్యాణ్‌కు దక్కిన ఘన విజయం. అంతకు ముందు 'పులి', 'తీన్‌మార్', 'పంజా' సినిమాల పరాజయాలతో ఆయన విమర్శల్ని ఎదుర్కొన్నాడు. కథల విషయంలో తప్పటడుగులు వేస్తున్నానని గ్రహించిన ఆయన పక్కా మాస్ మసాలా కథను ఎంచుకొని విజయాన్ని సాధించాడు. అయితే దాని సీక్వెల్ 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో ఆయన ఎదురుదెబ్బ తిన్నాడు.
'గబ్బర్‌సింగ్'కూ, 'సర్దార్ గబ్బర్‌సింగ్'కూ మధ్య తేడా ఏమంటే, అదివరకు ఆయన కేవలం పవర్‌స్టార్ మాత్రమే. అందువల్లే చట్టాన్ని తన చుట్టంలా భావించే 'గబ్బర్‌సింగ్'ను ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. కానీ 'సర్దార్ గబ్బర్‌సింగ్' దగ్గరకు వచ్చేసరికి ఆయన జనసేనాని కూడా. ఇప్పుడు పవన్‌కల్యాణ్ కేవలం నటుడు కాదు. ఎంతో బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు కూడా. తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై స్పందిస్తూ, అవసరమైతే.. వాళ్ల వద్దకు వెళ్తూ, వాళ్లకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్న వ్యక్తి. అందుకే ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయ్యుండీ యూనిఫాం వేసుకునే తీరు నుంచీ, ప్రవర్తించే విధానం దాకా అంతా సినిమాటిక్‌గా ఉంటూ వాస్తవికంగా ఉండకపోవడం వల్లే ఆ పాత్రను ఈసారి జనం యాక్సెప్ట్ చెయ్యాలేదు.
ఇప్పుడు మరోసారి పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు కల్యాణ్. ఆ సినిమా 'భీమ్లా నాయక్'. ఇది మలయాళంలో వచ్చిన హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్. కథ ప్రకారం డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) అనే ఒక పరపతి కలిగిన వ్యక్తితో వచ్చిన గొడవను వ్యక్తిగతంగా తీసుకొని, ఎంత దూరమైనా వెళ్లే పాత్ర. విపరీతమైన ఇగోతో వ్యవహరించే పాత్ర. డానియల్‌పై కక్ష తీర్చుకోవడానికి తన బలగాన్నంతా వినియోగించే పాత్ర. చట్టం తన చేతుల్లోనే ఉన్నట్లుగా ప్రవర్తించే పాత్ర. ఒరిజినల్‌లో అయిన ఆ పాత్ర ఎప్పుడూ పాన్ నములుతూ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తూ ఉంటుంది. ఆ దురలవాటును తెలుగులోనూ కొనసాగించినట్లయితే కల్యాణ్‌పై విమర్శలు తలెత్తవచ్చు.
ఎందుకంటే తమ నాయకుడ్ని అనుచరులు, అభిమానులు ఆదర్శంగా తీసుకుంటారు. సినిమాలో తమ అభిమాన హీరో ప్రవర్తించినట్లు నడచుకోవాలని వారు తహతహలాడుతుంటారు. అది.. దురలవాటైనా సరే.. ఆ పని చేస్తుంటారు. ఒరిజినల్ క్యారెక్టర్‌లో ఉన్న ఆ చెడు అలవాటును కల్యాణ్ కూడా కొనసాగించినట్లయితే సహ రాజకీయ నాయకుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మునుపటి సినిమా 'వకీల్ సాబ్'లో ముగ్గురు యువతులను రక్షించడానికి ఆయన తపన పడటం, కోర్టులో వారి తరపున వాదించడంతో ఆ పాత్ర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. తన ప్రస్తుత ఇమేజ్‌కు తగ్గ పాత్రను ఆయన చేశారని చాలామంది ఆయనను ప్రశంసించారు. వారిలో న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఉండటం గమనార్హం.
ఏదేమైనా 'భీమ్లా నాయక్' పాత్ర ద్వారా తానేం చెప్పదలచుకున్నననే విషయంలో పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాగర్‌చంద్ర డైరెక్ట్ చేస్తోన్న 'భీమ్లా నాయక్' 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
![]() |
![]() |