![]() |
![]() |
సుధీర్‌బాబు, ఆనంది జంటగా రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీ రేపు (ఆగస్ట్ 27)న థియేటర్లలో విడుదలవుతోంది. 'పలాస 1978'తో డైరెక్టర్‌గా పరిచయమైన కథారచయిత కరుణకుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇంతదాకా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా సుధీర్‌బాబుకు ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద బ్రేక్ ఇస్తుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆ సినిమా రిలీజవుతున్న సందర్భంలో కరుణకుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. అదే సమయంలో చర్చనీయాంశం కూడా అవుతున్నాయి.
"నేను కథలు చెప్పాలని ఇండస్ట్రీ కు వచ్చాను. ప్రస్తుతం మనం కథలు చెప్పడం మానేసి టెంప్లేట్ సినిమాలు చేస్తున్నాం. పరభాషా చిత్రాలు చూసి తమిళంలో, మలయాళంలో మంచి సినిమాలు వచ్చాయని మాట్లాడుకుంటున్నాం. సినిమా గ్లోబల్ అయిన తర్వాత ఇంటర్నెట్ విస్తృతి వేగంగా పెరిగిన తరువాత తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదనే క్వశ్చన్ మొదలయ్యింది. ఎంతసేపు మనం పరభాషా చిత్రాలను అప్రిషియేట్ చేస్తున్నాం కానీ మనం తీయడం లేదు. శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, చాలెంజ్ లాంటి లిటరేచర్ బేస్డ్ సినిమాలు, అలాగే లిటరరీ పీపుల్‌ని ఇన్వాల్వ్ చేసినన్ని సినిమాలు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలోనూ రాలేదు. ప్రపంచాన్ని షేక్ చేసిన 'బాహుబలి', 'అరుంధతి' చిత్రాలు కూడా తెలుగులోనే ఇచ్చాం." అని చెప్పాడు కరుణకుమార్.
'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని రూపొందించానని ఆయన తెలిపాడు. "ఇప్పటివరకు మనం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే అరిటాకులు, అరిసెలు, బొబ్బట్లు, అమ్మమ్మల ఆప్యాయతలు, పొలం గట్లు, మంచి మనసులు.. ఇవే ఫిక్స్ అయిపోయాం. తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుంటే ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుంది. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాలైన ఎమోషన్స్, భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది." అని కరుణకుమార్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |