![]() |
![]() |

తెలుగులో కొన్ని చిత్రాల్లో నాయికగా నటించిన ప్రముఖ మలయాళం నటి చిత్ర గుండెపోటుతో శనివారం ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన ఆమె వయసు 56 సంవత్సరాలు. కమల్ హాసన్ సినిమా 'అమావాస్య చంద్రుడు', రాజశేఖర్ సినిమా 'ఇంద్రధనుస్సు', రాజేంద్రప్రసాద్‌తో 'పదహారేళ్ల అమ్మాయి', రాజేశ్‌తో 'నల్లత్రాచు', దగ్గుబాటి రాజాతో 'నేటి స్వతంత్రం'.. తదితర చిత్రాల్లో ఆమె నటించారు. తన అందచందాలు, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఎక్కువగా మాతృభాష మలయాళం, తమిళ సినిమాల్లో నాయికగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు చిత్ర. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, జయరామ్, సురేశ్ గోపి, తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, కార్తీక్, ప్రభు తదితర స్టార్లతో కలిసి నటించారు.
1965లో కొచ్చిలో జన్మించిన చిత్ర సినిమాలతో బిజీ కావడంతో పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పారు. 1990లో విజయ రాఘవన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. 1992లో వారికి మహాలక్ష్మి అనే కుమార్తె పుట్టింది. వివాహానంతరం కొంత కాలం విరామంతో తిరిగి సినిమాల్లో నటించారు చిత్ర. 2005లో 'ప్రేమించాక' అనే సినిమాలో హీరోయిన్ తల్లిగా కనిపించారు. కొంత కాలంగా ఆమె తమిళ టీవీ సీరియల్స్ చేస్తూ వచ్చారు.
![]() |
![]() |