
సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఇదే ఆగస్టులో తెలుగునాట కథానాయికగా తొలి అడుగేసింది చెన్నై పొన్ను మేఘా ఆకాశ్. యూత్ స్టార్ నితిన్ కి జోడీగా మేఘ నటించిన ఆ చిత్రమే.. `లై` (2017). మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్.. మేఘకి శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. ఆ చిత్రమనే కాదు.. ఆ తరువాత మిస్ ఆకాశ్ నటించిన మరో తెలుగు సినిమా (ఛల్ మోహన్ రంగ)తో పాటు అరడజను తమిళ చిత్రాలు, రెండు హిందీ ప్రాజెక్ట్స్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ క్రమంలోనే.. ఐరెన్ లెగ్ ట్యాగ్ కూడా మేఘ సొంతమైంది.
కట్ చేస్తే.. చాన్నాళ్ళ తరువాత మేఘ ముచ్చటగా మూడో తెలుగు సినిమాతో పలకరించింది. ఆ చిత్రమే.. గురువారం (ఆగస్టు 19) థియేటర్స్ లోకి వచ్చిన `రాజ రాజ చోర`. శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రంలో అతని ప్రియురాలు సంజనగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది మేఘ. కాగా, మొదటి ఆట నుండే ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అలాగే.. మేఘ పాత్ర, అభినయానికి కూడా. మొత్తానికి.. నాలుగేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత మేఘ మురిపించిందన్నమాట.
ఇదిలా ఉంటే, మరో రెండు వారాల్లో మేఘ టైటిల్ రోల్ లో నటించిన `డియర్ మేఘ` రిలీజ్ కానుంది. అలాగే `మను చరిత్ర`, `గుర్తుందా శీతాకాలం`, `అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్` అనే తెలుగు సినిమాల్లోనూ ఈ అమ్మడు అభినయిస్తోంది. మరి.. రానున్న సినిమాలతోనూ మేఘ మరింతగా ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.






