![]() |
![]() |

ఈతరం అగ్ర కథానాయకుల్లో అత్యధిక `నంది` పురస్కారాలు అందుకున్న హీరోగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. `ఉత్తమ నటుడు` విభాగంతో పాటు `స్పెషల్ జ్యూరీ` కేటగిరిలోనూ మహేశ్ కి అవార్డులు దక్కాయి. అలా.. `స్పెషల్ జ్యూరీ` విభాగంలో మహేశ్ కి `నంది` పురస్కారాన్ని అందించిన చిత్రాల్లో `అర్జున్` ఒకటి. `ఒక్కడు` (2003) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో మహేశ్ నటించిన ఈ చిత్రాన్ని మహేశ్ సోదరుడు రమేశ్ బాబు నిర్మించారు.
తన కవల సోదరి (కీర్తి రెడ్డి) క్షేమం కోసం ఎంతకైనా తెగించే అర్జున్ (మహేశ్ బాబు) అనే యువకుడి కథే `అర్జున్` చిత్రం. సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ సినిమా తిరిగినా.. యాక్షన్ కే పెద్దపీట వేశారు దర్శకుడు. అలాగే భారీ వ్యయంతో నిర్మించిన `మధుర మీనాక్షి టెంపుల్` సెట్.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహేశ్ కి జంటగా శ్రియ నటించిన ఈ సినిమాలో మురళీ మోహన్, ప్రకాశ్ రాజ్, సరిత, రాజా, తనికెళ్ళ భరణి, నాజర్, రాజన్ పి. దేవ్, ఎమ్మెస్ నారాయణ, కళాభవన్ మణి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలకు దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో ``మధుర మధుర``, ``డుమ్ డుమారే`` చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 2004 ఆగస్టు 18న విడుదలై మహేశ్ బాబు అభిమానులను మురిపించిన `అర్జున్`.. నేటితో 17 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |