![]() |
![]() |

తెలుగునాట ఎన్నో ప్రేమకథా చిత్రాలు సందడి చేశాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. అలాంటి చిత్రాల్లో మ్యూజికల్ సెన్సేషన్ గా నిలిచిన `నువ్వు - నేను` ఒకటి. `చిత్రం` వంటి ట్రెండ్ సెట్టర్ తరువాత కథానాయకుడు ఉదయ్ కిరణ్ - సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా అదే బాటలో సాగింది. `చిత్రం`తో రీమా సేన్ ని తెలుగు తెరకు నాయికగా పరిచయం చేసిన తేజ.. ఈ సినిమాతో అనితను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు.
ఒకే కాలేజ్ లో క్లాస్ మేట్స్ అయిన పెద్దింటి అబ్బాయి రవి (ఉదయ్ కిరణ్), పేదింటి అమ్మాయి వసుంధర (అనిత).. కొన్ని నాటకీయ పరిస్థితుల తరువాత ప్రేమలో పడతారు. అయితే, వీరి ప్రేమకు వారి పెద్దలు అడ్డంకిగా నిలుస్తారు. చివరికి రవి, వసు ఎలా ఒకటయ్యారు? అనేదే `నువ్వు - నేను` చిత్రం. వినడానికి సింపుల్ స్టోరీలైనే అయినప్పటికీ.. యువతరాన్ని ఆకట్టుకునేలా ఆద్యంతం ఆసక్తికరంగా సినిమాని తీర్చిదిద్దాడు తేజ. ఉదయ్ - అనిత జంట కనుల పంటగా నిలిస్తే.. ఆర్పీ పట్నాయక్ అందించిన బాణీలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. `గాజువాక పిల్ల`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``ప్రియతమా``, ``నువ్వు నేను``, ``నువ్వే నాకు ప్రాణం``, ``నా గుండెలో``, ``నీ కోసమే ఈ అన్వేషణ`` కూడా విశేషాదరణ పొందాయి.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించిన ఈ సెన్సేషనల్ మూవీ.. హిందీలో `యే దిల్`, తమిళంలో `మధురై వీరన్`, బెంగాలీలో `దుజోన్` పేర్లతో రీమేక్ అయింది. హిందీ వెర్షన్ ని తేజ రూపొందించగా.. నాయిక పాత్రలో అనితనే నటించింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గుణచిత్ర నటుడు (భరణి), ఉత్తమ హాస్య నటుడు (సునీల్), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం (రసూల్ ఎల్లోర్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుందీ సినిమా. 2001 ఆగస్టు 10న విడుదలై అఖండ విజయం సాధించిన `నువ్వు - నేను`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |