![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాగే ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అయితే, ఆల్ - టైమ్ క్లాసిక్ గా నిలిచిన సినిమా మాత్రం ఇప్పటివరకు ఒకటే ఉంది. ఆ చిత్రమే.. `అతడు`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో అలరించాడు మహేశ్. సిల్వర్ స్క్రీన్ పై కంటే స్మాల్ స్క్రీన్ పైనే ఎక్కువ ఆదరణ పొందిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేశ్ ని త్రివిక్రమ్ ప్రెజెంట్ చేసిన విధానం ఘట్టమనేని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించింది. యాక్షన్ సీన్స్ లో ఎంతగా మెస్మరైజ్ చేశారో.. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ అంతగా ఆకట్టుకున్నారు మహేశ్. అందుకే.. `ఉత్తమ నటుడు`గా `నిజం` తరువాత మరోసారి నంది పురస్కారం అందుకున్నారాయన.
విక్టరీ వెంకటేశ్ నటించిన `వారసుడొచ్చాడు` (1988) చిత్రం ఛాయలతో `అతడు`ని రూపొందినప్పటికీ.. త్రివిక్రమ్ తన రాతతో, తీతతో కనికట్టు చేశారు. మహేశ్ కి జోడీగా త్రిష నటించిన ఈ సినిమాలో సునీల్, నాజర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, సోనూ సూద్, భరణి, రాహుల్ దేవ్, కోట శ్రీనివాసరావు, రాజీవ్ కనకాల ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన పాటలు - నేపథ్య సంగీతం, కేవీ గుహన్ ఛాయాగ్రహణం, శ్రీకరప్రసాద్ ఎడిటింగ్, జయభేరి ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు.. వెరసి `అతడు` తెలుగు వారి మదిలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. హిందీ, బంగ్లాదేశీ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయిన `అతడు`.. మూడు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకుంది. 2005 ఆగస్టు 10న విడుదలై జననీరాజనాలు అందుకున్న `అతడు`.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |