![]() |
![]() |

అక్షయ్ కుమార్‌తో 'కాంచన' హిందీ రీమేక్ 'లక్ష్మీ'ని డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్ మళ్లీ యాక్టర్‌గా మారిపోయాడు. సొంత నిర్మాణ సంస్థలో టైటిల్ రోల్ పోషిస్తూ ఆయన నిర్మిస్తోన్న 'దుర్గ' ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్‌ను రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్‌లో ఆయన రూపం భీతి కొలిపే విధంగా ఉంది. చూపులకు అఘోర టైపులో పొడవుగా పెంచిన గడ్డం మీసాలు, విభూతి నామం, కుంకుమ బొట్టుతో చూడ్డానికే దడపుట్టించే విధంగా కనిపిస్తున్నాడు. ఆ రూపంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.. ఆయన కళ్లే. పైకి చూస్తున్నట్లున్న ఆ కళ్లే భయపెడుతున్నాయి. మొత్తానికి మంత్రశక్తులున్న వ్యక్తిగా ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాడని అర్థమవుతోంది. ఈ లుక్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రెండు గంటల తర్వాత సెకండ్ లుక్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేశాడు లారెన్స్. అందులో హ్యాపీగా నవ్వుతున్న యువకుడిగా కనిపిస్తున్నాడు. పొడవుగా పెంచి జుట్టు, ఒక వైపు పైకి లేచిన షర్ట్ కాలర్ చూస్తుంటే.. అది టపోరి క్యారెక్టర్ అనిపిస్తోంది. ఈ రెండు లుక్స్‌ను బట్టి దుర్గలో లారెన్స్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలిసిపోతోంది.
ఈ సినిమాని తాను డైరెక్ట్ చేయడం లేదని లారెన్స్ వెల్లడించాడు. త్వరలోనే డైరెక్టర్ పేరును ప్రకటిస్తానని చెప్పాడు. 'రాఘవేంద్ర ప్రొడక్షన్' బ్యానర్‌పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నాడు. 'ముని' సిరీస్‌తో హారర్ కామెడీ జానర్‌లో తనకు అపజయం అనేది లేదని నిరూపించుకున్న లారెన్స్ మరోసారి అదే జానర్‌లో 'దుర్గ'ను తీస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |