![]() |
![]() |

సున్నితమైన కథాంశాలతో వెండితెరపై మాయాజాలం చేసే దర్శకుల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన తెరకెక్కించిన జనరంజక చిత్రాల్లో `ఫిదా` ఒకటి. `ప్రేమమ్` (మలయాళం)తో దక్షిణాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సాయిపల్లవిని తెలుగు తెరకు నేరుగా పరిచయం చేస్తూ.. శేఖర్ రూపొందించిన ఈ చిత్రంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించాడు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతోనే వరుణ్ తన కెరీర్ లో తొలి విజయాన్ని అందుకోవడం విశేషం.
పెళ్ళయ్యాక ఆడపిల్లలు తమకు సంబంధించినవన్నీ వదిలేసి అబ్బాయి ప్రపంచంలోకే ఎందుకు వెళ్ళాలి? పెళ్ళి చేసుకున్న అమ్మాయి ప్రపంచంలోకే అబ్బాయి ఎందుకు రాకూడదు? అని ఆలోచించే హైబ్రిడ్ పిల్ల భానుమతి (సాయిపల్లవి) కథే `ఫిదా`. తన బావకి తమ్ముడు అయన ఎన్నారై యువకుడు వరుణ్ (వరుణ్ తేజ్)ని ఇష్టపడ్డ భాను.. తన ప్రపంచంలోకి వరుణ్ ని తీసుకువస్తుందా? లేక తనే వరుణ్ ప్రపంచంలోకి వెళుతుందా? అనేది మిగిలిన సినిమా. లవ్ - హేట్ రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తెలంగాణ పోరి భానుమతిగా సాయిపల్లవి నటన కుర్రకారుని ఫిదా చేసింది. తనకిదే తొలి తెలుగు చిత్రమైనా తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది. ఇక ఆమెకి జంటగా నటించిన వరుణ్ కూడా తనదైన అభినయంతో అలరించాడు.
శక్తికాంత్ కార్తిక్ బాణీలందించిన ఈ సినిమాలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``వచ్చిండే`` ఆడియో పరంగానూ, వీడియో పరంగానూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ``ఊసుపోదు``, ``హే పిల్లగాడా``, ``హే మిస్టర్``, ``ఏదో జరుగుతోంది`` గీతాలు కూడా రంజింపజేస్తాయి. `ఉత్తమ నటి` (సాయిపల్లవి), `ఉత్తమ గాయకుడు` (హేమచంద్ర), `ఉత్తమ గాయని` (మధుప్రియ), `ఉత్తమ నృత్య దర్శకుడు` (శేఖర్ వీజే) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులు అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. 2017 జూలై 21న విడుదలై అఖండ విజయం సాధించిన మ్యూజికల్ సెన్సేషన్ `ఫిదా`.. నేటితో నాలుగేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |