![]() |
![]() |

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఒకటి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన ఈ నిర్మాణ సంస్థ.. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ సంస్థ ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్దేశకత్వంలోనే ఈ భారీ బడ్జెట్ మూవీ కూడా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే.. నటసింహం నందమూరి బాలకృష్ణతోనూ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ఇటీవల ఈ మేరకు బాలయ్యతో చర్చలు జరిపారట సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు). బాలకృష్ణ కూడా ఈ సంస్థలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. త్వరలోనే బాలయ్య, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఫస్ట్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానుంది. అయితే, దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారా? లేదంటే మరెవరైనా టేకప్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
మరి.. తారక్ తో `అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ.. బాలయ్యతోనూ అదే ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం `అఖండ`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు బాలయ్య. ఆపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అలాగే, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నారు.
![]() |
![]() |