![]() |
![]() |

సినీ నటుడు, దర్శకుడు, క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు టాలీవుడ్ లో పలువురు సన్నిహితులు, స్నేహితులు ఉన్నారు. వారంతా కలిసి ఈ నెల 18 న ఆయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
"కత్తిమహేష్ కు చివరి వీడ్కోలు.. ఇన్ని వైరుధ్యాలు,విస్పోటక వైఖరులు, తెలివి, పరుష వ్యక్తీకరణలు కలిగిన మనిషి అనుకునే మహేష్ వ్యక్తిత్వాన్ని చర్చించుకోడానికి, అతని మరణం తవ్విన కన్నీటి చెలమలను ఒంపేసుకోడానికి ఒక వేదిక ఇవ్వడం ధర్మం. మహేష్ మరణాన్ని చూసి సంతోషించే సమాజానికీ, ఆయన స్నేహంలో సత్యాన్ని చూడ ప్రయత్నించిన సమాజానికి కూడా ఎన్నో సందేహాలు సంశయాలు ఉండి ఉంటాయి. వాటినైనా ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం. స్నేహితుడికి తుది వీడ్కోలు ఇవ్వడానికి దూరం ప్రయాణం చెయ్యలేక పోయిన అనేక మంది మనసుల్ని కాస్త తేలిక చేద్దాం అనుకునే ఒక సందర్భం ఏర్పాటు చేస్తున్నాం." అంటూ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రెస్ నోట్ లో తెలియజేశారు.

హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో 250 మంది స్నేహితులు పాల్గొననున్నారని తెలుస్తోంది. మహేష్ గురించి స్నేహితుల పలుకులు, మహేష్ జీవితం మీద ఒక ప్రత్యేక వీడియో, మహేష్ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి.
![]() |
![]() |