![]() |
![]() |

కన్నడ చిత్ర సీమలోనే అత్యధిక వసూళ్ళు ఆర్జించిన చిత్రంగా నిలిచింది `కేజీఎఫ్: ఛాప్టర్ 1`. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలైన ఈ పిరియడ్ యాక్షన్ డ్రామా.. కేవలం కన్నడలోనే కాకుండా అన్య భాషల్లోనూ అఖండ విజయం సాధించింది. రాకింగ్ స్టార్ యశ్ కి, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి `పాన్ - ఇండియా` ఇమేజ్ ని తీసుకువచ్చింది. అలాంటి `కేజీఎఫ్` సిరీస్ లో రెండవ, చివరి చిత్రమైన `కేజీఎఫ్: ఛాప్టర్ 2` కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉండిఉంటే.. మరో వారం రోజుల్లో అంటే జూలై 16న ఈ క్రేజీ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసి ఉండేది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ప్లానింగ్ మారిపోయింది.
కాగా, చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న `కేజీఎఫ్: ఛాప్టర్ 2`కి సంబంధించి.. ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `కేజీఎఫ్: ఛాప్టర్ 1` ఎలాగైతే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ మూడవ వారంలో సందడి చేసిందో.. అలాగే `ఛాప్టర్ 2`ని కూడా డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `కేజీఎఫ్: ఛాప్టర్ 2`లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు.. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ వంటి దక్షిణాది ప్రముఖలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
![]() |
![]() |