![]() |
![]() |

రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన టాలీవుడ్ టాప్ స్టార్స్ లో సీనియర్ హీరో రాజశేఖర్ ఒకరు. ఆయన నటించిన రీమేక్ చిత్రాల్లో సింహభాగం విజయం సాధించాయి. వాటిలో `సింహరాశి` ఒకటి. తమిళ చిత్రం `మాయి` (శరత్ కుమార్, మీనా) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని మాతృకని నిర్మించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థనే నిర్మించింది. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు వి. సముద్ర తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. కోట్లకు పడగెత్తినా నిరాడంబరంగా వ్యవహరించే నరసింహరాజు అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథగా `సింహరాశి` తెరకెక్కింది. ఎలాంటి వారినైనా కదిలించే రాజు గతమే ఈ చిత్రానికి ప్రధాన బలం.
రాజశేఖర్ కి జంటగా సాక్షి శివానంద్ నటించిన ఈ సినిమాలో విజయ్ కుమార్, వింధ్య, వర్ష, గిరిబాబు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అచ్యుత్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. మాతృకకి బాణీలు అందించిన ఎస్. ఎ. రాజ్ కుమార్ రీమేక్ కి కూడా స్వరాలు అందించారు. ``తెలుసా నేస్తమా``, ``అమ్మ అని పిలిచి``, ``సత్యభామ సత్యభామ``, ``రాణి రాణి``, ``పేదలంటే ప్రాణమిచ్చే``.. ఇలా ఇందులోని గీతాలన్నీ ప్రజాదరణ పొందాయి. 2001 జూలై 6న విడుదలై అఖండ విజయం సాధించిన `సింహరాశి`.. నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |