![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకి అచ్చొచ్చిన దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. ట్రాక్ తప్పిన ప్రతీసారి రవితేజకి గోపీచంద్ కాంబినేషన్ లో భలే విజయాలు దక్కాయి. `డాన్ శీను` (2010), `బలుపు` (2013), `క్రాక్` (2021).. ఇలా ఈ మూడు చిత్రాలకి ముందు మాస్ మహారాజాకి వరుస పరాజయాలు లేదంటే యావరేజ్ మూవీస్ నే ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. `బలుపు`కి ముందు అయితే `వీర`, `దొంగలముఠా`, `నిప్పు`, `దరువు`, `దేవుడు చేసిన మనుషులు`, `సారొచ్చారు`.. ఇలా అరడజను అపజయాలున్నాయి. ఇలాంటి తరుణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన `బలుపు`.. రవితేజకి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది.
రవితేజ మార్క్ కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ తోనే రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో శ్రుతిహాసన్, అంజలి నాయికలుగా నటించగా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అడివి శేష్, అశుతోష్ రాణా, అలీ, నాజర్, బ్రహ్మాజీ, రావు రమేశ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, సత్యం రాజేశ్, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, సురేఖా వాణి, అర్చన ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రాయ్ లక్ష్మీ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది.
యువ సంగీత సంచలనం తమన్ అందించిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. `గానగంధర్వుడు` ఎస్పీబాలసుబ్రమణ్యం ఆలపించిన ``నిను చూసిన క్షణంలో`` (ఏమైందో) మెలోడీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వర పొట్లూరి నిర్మించిన `బలుపు`.. 2013 జూన్ 28న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ మాస్ ఎంటర్టైనర్ 8 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |