![]() |
![]() |

తమిళనాడులో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ సమంత నటించింది. అయితే ఈ పాత్రను నెగెటివ్ గా చూపించడం పట్ల తమిళనాడు ప్రజలు మండిపడున్నారు. ఈ వెబ్ సిరీస్ ను నిషేధించాలంటూ ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వెబ్ సిరీస్ ను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్ సిరీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని భారతీరాజా అన్నారు. ఈ వెబ్ సిరీస్ ను తమిళ ద్రోహులు రూపొందించారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము అమెజాన్ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని భారతీరాజా హెచ్చరించారు.
కాగా ఇటీవల విడుదలైన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సమంత నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సిరీస్ తో ఆమె నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించింది.
![]() |
![]() |