![]() |
![]() |

'యువకుడు' సినిమాతో తెరంగేట్రం చేసి, 'ఒక్కడు', 'ఖుషి' సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారారు భూమిక చావ్లా. కెరీర్ పీక్‌లో ఉండగా యోగా గురువైన భరత్ ఠాకూర్‌ను 2007లో పెళ్లాడాక కూడా నటనను కొనసాగించినా, ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు. అప్పట్నుంచీ అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు భూమిక. కొంత కాలం క్రితం భర్తతో ఆమెకు పొరపొచ్చాలు వచ్చాయనీ, ఇద్దరూ విడిపోతున్నారనీ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదనీ, తాము హ్యాపీగా ఉన్నామనీ భూమిక స్పష్టం చేశారు.
కాగా, రానున్న బిగ్ బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా భూమికను సంప్రదిస్తున్నారనీ, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. అయితే తనను లేటెస్ట్ సీజన్ కోసం ఇంతదాకా ఎవరూ సంప్రదించలేదని భూమిక వివరణ ఇచ్చారు. ఒకటి, రెండు, మూడు సీజన్లకు మాత్రం తనను సంప్రదించినా తాను ఒప్పుకోలేదని కూడా ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆమె రాసుకొచ్చారు.
తన అందమైన ఫొటోను షేర్ చేసిన ఆమె, "అందులో నిజం లేదు. బిగ్ బాస్ కోసం నాకు ఆఫర్ రాలేదు. ఆఫర్ వచ్చినా నేను చేయను. 1, 2, 3 సీజన్ల కోసం ఆఫర్లు వచ్చాయి. కానీ వాటన్నింటినీ నేను రెఫ్యూజ్ చేశాను. ఈసారి నన్నెవరూ సంప్రదించలేదు. ఇప్పటికీ దాన్ని చేయాలని నేననుకోవట్లేదు. నేను పబ్లిక్ పర్సనాలిటీని. కానీ నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ను కూడా. ఇరవై నాలుగ్గంటలూ కెమెరా నా మీద ఉండటాన్ని కోరుకోను." అని రాసుకొచ్చారు. ఆమె పోస్ట్‌కు 'మైనే ప్యార్ కియా' హీరోయిన్ భాగ్యశ్రీ స్పందించారు. "సో ప్రెటీ" అని కామెంట్ పెట్టారు.

![]() |
![]() |