![]() |
![]() |

అద్భుత గాయనీమణి ఆశా భోస్లే. అక్క, గానకోకిల లతా మంగేష్కర్ ఛాయ నుంచి బయటపడి, అక్కకు ధీటైన గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అంటే మాటలా! ఏ విషయంలోనైనా అమీతుమీ తేల్చుకోవడం ఆశా తత్వం. వెనకడుగు వేయడం ఆమెకు తెలీదు. ఆ పట్టుదల వల్లనే ఆమె విలక్షణ గాత్రంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. చురాలియా, కంభఖ్త్ ఇష్క్, ఇన్ ఆంఖోకీ మస్తీ, ఓ మేరే సోనారే, ఆయియే మెహర్‌బాన్, భవ్‌రా బడా నాదాన్ హై, చోడ్ దో అంచల్ జమానా క్యా కహేగా, యే రాత్ ఏ మౌసమ్, ఓ సాథీ చల్, యే మేరా దిల్ ప్యార్ కా దీవానా, తన్‌హా తన్‌హా లాంటి పాటలు ఎన్నో వందల పాటలు ఆశా గళంలో ప్రాణం పోసుకొని, మనల్ని ఆహ్లాదపరుస్తూనే ఉన్నాయి.
తెలుగులోనూ ఆమె కొన్ని పాటలు పాడారు. పాలు నీళ్లు, చిన్ని కృష్ణుడు, అంతం, పవిత్ర బంధం, అశ్వమేధం చిత్రాల్లో ఆమె గళం కమనీయతను ఒలికించింది. అంతేకాదు, జంధ్యాల దర్శకత్వంలో తీద్దామనుకున్న 'హరికీర్తనాచార్య అన్నమయ్య' చిత్రం కోసం రమేశ్ నాయుడు సంగీత దర్శకత్వంలో ఆశా పాడిన "సత్యభామ సరసపు నగవు" వంటి అన్నమయ్య గీతాలు వినడానికి పరమాద్భుతంగా ఉంటాయి. వాటిని తెలుగేతరులు పాడినట్లు ఉండవు. తెలుగువారికే నోరు తిరగడం కష్టమైన "లాలనుచుపోసేరు లలన లిరుగడల" పాటను ఆశా సునాయాసంగా పాడటం అబ్బురం.
తనతో 'పాలు నీళ్లు' చిత్రం కోసం తొలిసారిగా పాడించిన సంగీత దర్శకుడు సత్యం అంటే ఆశాకు ఎంతో గౌరవం. ఆ సినిమాలో ఆమె "ఇది మౌనగీతం" పాటను ఆలపించారు. ఆ పాటను చిత్రంలో హీరోయిన్ జయప్రదపై చిత్రీకరించారు దర్శకుడు దాసరి. మద్రాసుకు ఆశా ఎప్పుడైనా వచ్చి, ఎన్ని రోజులుంటే అన్ని రోజులూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా సత్యం ఇంటి నుంచి వెళ్లాల్సిందే. ఆ ఉప్మా అంటే ఆమెకు అంత ఇష్టం.
![]() |
![]() |