![]() |
![]() |

యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిన్నటి తరం కథానాయకుల్లో అర్జున్ ఒకరు. హీరోగా తన హవా తగ్గిన నేపథ్యంలో.. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, విలన్ గానూ తనదైన ముద్ర వేస్తున్నారీ వెర్సటైల్ స్టార్. ఇదిలా ఉంటే.. త్వరలో ఈ యాక్షన్ కింగ్ ఓ క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్ లో ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` పేరుతో ఓ సోషల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో బ్యాడీగా అర్జున్ నటించబోతున్నట్లు సమాచారం. ఇదివరకు ఇదే పాత్ర కోసం అరవింద్ స్వామి, మాధవన్ పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. అర్జున్ ని ఆ పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే `సర్కారు వారి పాట`లో అర్జున్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `ఒక్కడు`తో `ఒకే ఒక్కడు` జట్టుకట్టనున్న వైనం.. సినిమాకి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట`లో మహేశ్ కి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప్రస్తుతం చిత్రీకరణకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక షూటింగ్ పునః ప్రారంభం కానుంది.
![]() |
![]() |