![]() |
![]() |
.jpg)
చెన్నై బ్యూటీ రెజీనా కసాండ్రా అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలు చేస్తూ, రెండు భాషల ఆడియెన్స్‌ను తన అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంటూ వస్తోంది. అడివి శేష్ సినిమా 'ఎవరు'లో ఆమె నటనను అంత త్వరగా మర్చిపోలేం. దానికంటే ముందు 'అ!' మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఆమెకు దక్షిణ భారతీయుల సంప్రదాయలంటే చాలా ఇష్టం. ఇవాళ్టి రోజుల్లో చాలామంది మోడరన్ అమ్మాయిలు సహజీవనానికి ఇష్టపడుతుండటం మనకు తెలుసు. కానీ ఆమెకు అలాంటి వాటిపై నమ్మకం లేదు.
"నేను మన సంప్రదాయాల్ని గౌరవిస్తాను. మనకు తెలీని అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతాను. చర్చికి వెళ్తుంటాను. సహజీవనంలో నాకు నమ్మకం లేదు. అందరి సమక్షంలో సంప్రదాయబద్ధంగా చేసుకునే పెళ్లిలో ఎంత ఆనందం, సందడి ఉంటాయి! అలాంటి సందడిని నేను ఇష్టపడతాను." అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.
అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు కానీ, పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబం ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లాలనేది ఆమె కోరిక. "అక్కడ తోడికోడళ్లు, ఆడబిడ్డలు, మరదులు వంటివాళ్లంతా ఉండి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. మాది చిన్న కుటుంబం కాబట్టి ఇలాంటి కోరిక ఏర్పడిందేమో తెలీదు. జగమంత కుటుంబానికి కోడలు అయితే బావుంటుందనేది నా ఆశ." అని తెలిపింది 30 ఏళ్ల రెజీనా. ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే కూతురు మరి.
చిరంజీవి 'ఆచార్య' మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్న రెజీనా, కొరియన్ ఫిల్మ్ 'మిడ్‌నైట్ రన్నర్స్' ఆధారంగా రూపొందే తెలుగు సినిమాలో నటిస్తోంది. అలాగే 'నేనే నా' అనే ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం చేస్తోంది.
![]() |
![]() |