![]() |
![]() |
.jpg)
నిజ జీవితంలో మేనమామ మేనల్లుళ్లు అయిన అక్కినేని నాగార్జున, సుమంత్ స్నేహితులుగా కలిసి నటించిన సినిమా 'స్నేహమంటే ఇదేరా'. జయరామ్, ముఖేశ్ నటించగా బ్లాక్‌బస్టర్ అయిన మలయాళం ఫిల్మ్ 'ఫ్రెండ్స్'కు ఇది రీమేక్. నాగార్జున జోడీగా భూమిక, సుమంత్ సరసన ప్రత్యూష నటించిన ఈ చిత్రానికి బాలశేఖరన్ దర్శకుడు. శివశంకర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటల్ని కులశేఖర్, చిర్రావూరి విజయ్‌కుమార్, మృత్యుంజయుడు రాశారు.
సాధారణంగా ఒక గేయరచయిత రాసిన పాటను మరో గేయరచయిత మెచ్చుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. అలా మెచ్చుకుంటే చెప్పుకోవడానికి చాలా బావుంటుంది. 'స్నేహమంటే ఇదేరా' సినిమా పాటలకు సంబంధించి అదే జరిగింది. ఈ మూవీలో టైటిల్ సాంగ్‌ను కులశేఖర్ రాశారు. ఆ పాట తనకెంతో నచ్చిందని చంద్రబోస్ చెప్పారు.
"ముఖ్యంగా రెండో చరణం ఎంతో గొప్పగా ఉందండి. సృష్టిలో మానవుడి కన్నా ముందరది ప్రకృతి. ఆ ప్రకృతిని బేస్‌గా తీసుకొని పాటను డెవలప్ చెయ్యడం, ఆ సమన్వయం అన్నీ చక్కగా చేశాడు కులశేఖర్. ఎన్ని ఇబ్బందులున్నా కొనసాగేదే స్నేహం. రెండో చరణంలో కూడా ఆ ఓరియంటేషన్ ఉంది. అటువంటి కంటెంట్ ఉండటం వల్లే ఆ పాట బావుందని ఫీలయ్యాను." అని వివరించారు చంద్రబోస్.
చంద్రబోస్ మెచ్చిన ఆ రెండో చరణంలో..
"వాన చినుకే నేలతల్లితో చెలిమి కోరిందీ
ఉరకలేసే ఏరు పడవతో చెలిమి చేసిందీ
ఆ నింగి నేలల్లోనా కొండ కోనల్లోనా
తియ తియ్యని స్నేహం దాగుందీ" లాంటి లైన్లున్నాయి.
![]() |
![]() |