![]() |
![]() |

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ సినీ వారపత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి.ఎ. రాజు శుక్రవారం (మే 21) రాత్రి 7:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్, దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. బీఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్వోగా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాజు.. ఆ తర్వాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దిన, వార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన అనంతరం 1994లో తన భార్య జయ బి. (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో మంచి పేరు సంపాదించుకున్నారు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు, సాంకేతిక నిపుణులకు పీఆర్వోగా పని చేశారు బి.ఏ.రాజు.
అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు. చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి మొదట ఘటికాచలం దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి చిత్రాన్ని, తన భార్య జయ బి. దర్శకత్వంలో చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ సినీ రంగం లో పని చేస్తున్నవారే. అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వీఎఫ్ఎక్స్ నిపుణుడు. శివ కుమార్.. పూరి జగన్నాధ్, వి వి వినాయక్, మారుతీ, వంటి ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించి '22' అనే చిత్రంతో దర్శకుడయ్యాడు. కరోనా కారణంగా ఆ సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది.
చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ , యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబులతో బీఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది. "కృష్ణ గారి సినిమాలకు పని చేశాను, ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను, రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పీఆర్వోగా చేస్తాను" అని ఆయన అంటుండేవారు.
ఇక సినీ పాత్రికేయ కుటుంబంలో రాజుకు విశిష్ట స్థానం ఉంది. సినీ పాత్రికేయులు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించే బి.ఏ.రాజు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి రాజు ఎదిగారు.
చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించిన బీఏ రాజు అనూహ్య మరణ వార్త చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక దిగ్భ్రాంతికర వార్తే. కాగా బి.ఏ.రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
![]() |
![]() |