![]() |
![]() |

డబ్బింగ్ సినిమాల డైలాగ్ రైటర్ అంటే మొదటగా మనకు గుర్తుకు వచ్చే పేరు దివంగత రాజశ్రీ. ఆయన అసలు పేరు ఇందుకూరి రామకృష్ణంరాజు. 400కు పైగా డబ్బింగ్ సినిమాలకు ఆయన రచన చేశారు. ఆయన ఎక్కువగా తమిళం, కన్నడం నుంచి తెలుగులోకి డబ్ చేసిన చిత్రాలకు డైలాగ్స్, సాంగ్స్ రాశారు. సాధారణంగా స్ట్రయిట్ సినిమాల రచనతో పోల్చుకుంటే, డబ్బింగ్ సినిమాలకు రచన చేయడం ఈజీ అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ డబ్బింగ్ సినిమాకు డైలాగ్స్ రాయడం ఎంత క్లిష్టమైన పనో ఒకసారి రాజశ్రీ చెప్పారు.
ముక్తా ఫిలిమ్స్ వారి 'వెళ్లితిరై' ఆధారంగా వచ్చిన 'మూఢనమ్మకాలు' ఆయన తొలి చిత్రం. "డబ్బింగ్ రచయితలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తలనెప్పి రచన ఇది. ఎందుకంటే తెరమీద నటీనటుల పెదవుల కదలికకు తగ్గట్టు ఒరిజినల్ డైలాగ్‌కు న్యాయం చేస్తూ తెలుగులో సంభాషణలు రాయాలి. సంభాషణల భావం చెప్పగలం. పెదాల కదలికకు సరిపోయేలా ఎలోగో చేయగలం. కానీ అదే పాట అయినప్పుడు చాలా కష్టం." అంటూ ఆయన ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు.
"ఒక తమిళ చిత్రం తెలుగులోకి డబ్ చేస్తున్నాం. అందులో హీరోయిన్ జయలలిత. హీరోకి పొడుపు కథల్ని వేస్తూ పాట పాడుతుంది. హీరో ఆ పొడుపు విప్పాలి. 'అక్కాళె వొరువన్, అప్పావై ఒరితియుమ్'. హీరో విడగొట్టి చెపుతాడు. 'అ కాళై ఒరువన్, అ పావై ఒరువన్' అని. హీరోయిన్ కలిపి చెప్పిన మాటని విడగొట్టడంతో అర్థం మారింది. కాళై అంటే మగ. పావై అంటే ఆడ. ఈ చరణాలప్పుడు తెరమీద క్లోజ్ షాట్లో వీళ్లుంటారు. కచ్చితంగా పెదాల కదలికకు తగ్గట్టు పాట రాయాలి. ఎలా? ఎంత ఆలోచించినా ఏం తోచలేదు. నాకు అది మొదటి చిత్రం. అప్పటికే ఎంతో అనుభవం, పేరుగల రచయిత అనిశెట్టిగారిని ఆ పాదం వరకు రాసిపెట్టమని అడిగాను. ఆయన చాలాసేపు ఆలోచించి పెదవి విరిచి వెళ్లిపోయారు. తమిళానికి సరైన అర్థం 'అక్కయ్య మొనగాడు, అమ్మకు జతగాడు' అని. దాన్ని నేను ఇలా రాశాను - 'అక్కకు అయ్య మొనగాడు, అమ్మకు జతగాడు' అని."
రాజశ్రీకి డబ్బింగ్ రైటర్‌గా ఎన్ని సినిమాలు పేరు తెచ్చినా ఆయనకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రాలు.. తమిళం నుంచి డబ్ చేసిన 'మౌనరాగం', 'నాయకుడు', కన్నడం నుంచి డబ్ చేసిన 'మహావీర మయూర', 'భక్త శిరియాళ'. రాజశ్రీ తనయుడు రాజశ్రీ సుధాకర్ కూడా డబ్బింగ్ సినిమాల రైటరే.
![]() |
![]() |