![]() |
![]() |

పేరుపొందిన సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి. ఆనంద్ గుండెపోటుతో శుక్రవారం ఉదయం చెన్నైలో మృతి చెందారు. గుండె నొప్పి రావడంతో అసౌకర్యంగా ఫీలైన ఆయన స్వయంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స కోస వెళ్లగా, అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. వికటన్ పబ్లికేషన్స్‌లో ఫొటో జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన ఆయన, అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాటోగ్రాఫర్‌గా మారారు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన 'తెన్‌మవిన్ కొంబత్తు' ఆయన ఫస్ట్ ఫిల్మ్.
కదిర్ డైరెక్షన్‌లో టబు, వినీత్, అబ్బాస్ నటించిన 'కాదల్ దేశమ్' (ప్రేమదేశం) ఆయనకు సినిమాటోగ్రాఫర్‌గా బాగా పేరు తెచ్చిపెట్టింది. అనంతరం డైరెక్టర్ శంకర్‌తో కలిసి మూడు సినిమాలకు పనిచేశారు ఆనంద్. అవి.. 'ముదలవాన్' (ఒకే ఒక్కడు), 'బాయ్స్', 'శివాజీ'. తెలుగులోనూ ఒక సినిమాకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. అది మోహన్‌బాబు, మీనా జంటగా ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన 'పుణ్యభూమి నా దేశం' చిత్రం.
శ్రీరామ్, గోపిక, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన కణ కండేన్ మూవీతో డైరెక్టర్‌గా మారారు ఆనంద్. అది మంచి విజయం సాధించింది. తెలుగులో ఆ సినిమా కర్తవ్యం పేరుతో రిలీజైంది. డైరెక్టర్‌గా ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమా జీవా, కార్తీక జంటగా నటించిన 'కో'. 'రంగం' పేరుతో తెలుగులోనూ ఆ మూవీ ఘన విజయం సాధించింది. సూర్య హీరోగా 'అయన్' (వీడొక్కడే), 'మాట్రాన్' (బ్రదర్స్), 'కాప్పాన్' (బందోబస్త్) సినిమాలను, ధనుష్ హీరో 'అనేగన్' (అనేకుడు), విజయ్ సేతుపతి హీరోగా 'కవన్' సినిమాలను ఆయన రూపొందించారు. ఆయన చివరి సినిమా 'కాప్పాన్' (2019).
![]() |
![]() |