![]() |
![]() |

టాలీవుడ్‌లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. కేవలం బుల్లితెరకి మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై కూడా సందడి చేస్తుంటుంది. ఈ బ్యూటీ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అశ్విన్ విరాజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనసూయ గర్భిణి పాత్రలో కనిపించనుంది. అయితే దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండడంతో టాలీవుడ్ లో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం ఓటీటీలో విడుదలవుతున్నాయి.
తాజాగా అనసూయ నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ ను రద్దు చేసుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్ లలో విడుదల చేయాలనుకున్నారు కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే 7న 'ఆహా' ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాని 'ఆహా' ఎంతపెట్టి కొన్నదనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ సినిమా కోసం 'ఆహా' చెల్లించిన మొత్తం రూ.1.8 కోట్లు. అంటే మొత్తంగా రెండు కోట్లు కూడా కాదన్నమాట. నిజానికి ఈ సినిమాను థియేటర్లో విడుదల చేసిన వారానికి ఆహాలో రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ థియేటర్లు క్లోజ్ అవ్వడం, కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉండడంతో 'ఆహా'తో డీల్ కుదుర్చుకున్నారు. కానీ అనసూయ నటించిన సినిమాకి రెండు కోట్లు కూడా పలకకపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాతలు కూడా ఇంత తక్కువ మొత్తానికి సినిమాను ఎలా అమ్మారో అర్థం కావట్లేదంటూ సోషల్ మీడియాలో వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అనసూయ 'పుష్ప' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది అనసూయ.
![]() |
![]() |