![]() |
![]() |

సీనియర్ నటుడు, మరుగుజ్జు రూపంతో అనేక సినిమాల్లో తన నటనతో అలరించిన పొట్టి వీరయ్య ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయన మృతిపట్ల తెలుగు చిత్రసీమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. నల్గొండ జిల్లాలోని ఫణిగిరి గ్రామం ఆయన స్వస్థలం.
బి. విఠలాచార్య దర్శకత్వం వహించగా కాంతారావు హీరోగా నటించిన 'అగ్గిదొర' (1967) చిత్రంతో నటుడిగా పరిచయమైన వీరయ్య 500కు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో తమిళ, కన్నడ, మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. దాసరి నారాయణరావు తొలి చిత్రం 'తాత మనవడు' నుంచి ఆయన రూపొందించిన పలు చిత్రాల్లో వీరయ్య నటించారు. లంచావతారం, గోలనాగమ్మ, రౌడీ బాబాయ్, ఖైదీ రాణి, సింహబలుడు, యుగంధర్, గజదొంగ, నాకూ పెళ్లాం కావాలి, జేబుదొంగ, కలియుగ కృష్ణుడు, మాయలోడు, బ్రహ్మపుత్రుడు తదితర చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు.
వీరయ్య భార్య మల్లిక 2008లో మృతి చెందారు. ఆయన చిన్నకుమార్తె విజయదుర్గ సైతం పలు చిత్రాల్లో నటించారు. హైస్కూల్లో చదువుకునేటప్పుడే వీరయ్య నాటికలు, నాటకాల్లో నటించేవారు. సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు వెళ్లారు. శోభన్‌బాబు సలహాతో విఠలాచార్యను కలవడం వల్ల తనకు 'అగ్గిదొర'లో నటించే అవకాశం వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో వీరయ్య తెలిపారు.
![]() |
![]() |