![]() |
![]() |

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆయన ఫస్ట్ లుక్‌ను ఒక మోషన్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేసింది. ఆ మోషన్ పోస్టర్‌లో అనేక మంది సాయుధులైన బ్రిటీష్ సైనికులు అజయ్‌ను చుట్టుముట్టారు. ఒక వాయిస్ "లోడ్.. ఎయిమ్.. షూట్" అంటూ ఉండగా ఆ సైనికులు అజయ్‌కు సమీపంగా వచ్చారు. చివరలో చుట్టూ కప్పుకున్న వస్త్రాన్ని ఒక్కసారిగా తీసేశాడు అజయ్. దాంతో ఆయన రూపం సంపూర్ణంగా వెల్లడైంది. బుల్లెట్లు నింపిన బెల్టు ఉన్న ఖద్దరు దుస్తుల్ని ధరించి ఉన్నాడు అజయ్. తలగుడ్డ మీదుగా చెంపల మీదకు రక్తం ధార కడుతోంది. ఆయన కళ్లల్లో ఇంటెన్సిటీ ఆకట్టుకుంటోంది.
'ఆర్ఆర్ఆర్'లో ఆయన తారక్, చరణ్‌లకు గురువుగా కనిపించనున్నారని టాక్. ఆయన సరసన శ్రియ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్ లుక్‌కు అన్ని వైపుల నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన లుక్ మోషన్ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన తారక్, "He will ensure that all his men hit the bullseye! Meet Ajay Devgn in an avataRRR as never seen before!" అంటూ ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్ అయితే, "He is a man on the mission to empower his people. Strong, emotional and inspirational, he's going to make a mark! Ajay Devgn Sir it was a great experience having you in RRR Movie." అని రాసుకొచ్చాడు.

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో వారి సరసన వరుసగా అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ఎస్సెట్స్ కానున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్'ను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి' సిరీస్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి.
![]() |
![]() |