![]() |
![]() |

తెలుగు ఇండస్ట్రీ వల్లే మిగతా ఇండస్ట్రీల వాళ్లు ఆశలు పెట్టుకుంటున్నారని హీరో కార్తీ అన్నారు. "మిగిలిన అన్ని ఇండస్ట్రీలు తెలుగు ఇండస్ట్రీ వైపే చూస్తున్నాయి. ఇక్కడ మంచి సినిమా వస్తే బాగా ఆడుతుంది. నార్మల్ టైమ్‌లో వచ్చే కలెక్షన్ల కంటే డబల్ కలెక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో.. ఇండస్ట్రీకి ఇది గొప్ప ఆశను కలిగిస్తోంది." అని ఆయన చెప్పారు. ఆయన టైటిల్ రోల్ పోషించిన 'సుల్తాన్' సినిమా ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఈ సినిమా ద్వారా రష్మికా మందన్న హీరోయిన్‌గా తమిళ చిత్రసీమకు పరిచయమవుతోంది. బక్కియరాజ్ కణ్ణన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన కార్తీ, మీడియా ప్రతినిధులతో సంభాషించాడు.
సుల్తాన్‌ను థియేటర్లలోనే రిలీజ్ చేయమనీ, ఓటీటీకి వెళ్లవద్దనీ డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా చెప్పారని ఆయన తెలిపాడు. "అందుకే థియేటర్లలోనే రిలీజ్ చెయ్యాలని ఇప్పుడు వస్తున్నాం. కొన్నిసార్లు మనం అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సినిమాలోని కంటెంట్‌పై నమ్మకంతోనే సుల్తాన్‌ను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం." అని ఆయన వెల్లడించాడు.
కొవిడ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఏడాది కచ్చితంగా వంద సినిమాల దాకా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డాడు. "కొవిడ్ టైమ్‌లో లైఫ్ ఎలా ఉంది, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి లాంటి కంటెంట్‌తో సినిమాలు వస్తాయనుకుంటున్నా. డైరెక్టర్లు అలాంటి కథలను సృష్టిస్తారు." అని చెప్పాడు కార్తీ.
అన్నయ్య సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలనేది ఆయన ఛాయిస్ కాదనీ, ప్రొడ్యూసర్ ఛాయిస్ అనీ కార్తీ తెలిపాడు. "ఆ సినిమా రిలీజ్ చేసే సమయానికి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలీదు. అది మూడేళ్ల క్రితం మొదలైన సినిమా. రిలీజ్ కోసం చాలా కాలం నుంచి నిరీక్షిస్తూ వచ్చారు. దాంతో ఆ మూవీని ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకున్నారు. అది అన్నయ్య డెసిషన్ కాదు." అని స్పష్టం చేశాడు కార్తీ.
![]() |
![]() |