![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలిసారి స్క్రీన్ పంచుకుంటోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రెండు దశాబ్దాల కాలంలో ఒకే వయసులో ఉన్న ఒకే రకమైన స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న తొలి మల్టీస్టారర్ ఇదే. గతంలో ఎన్టీఆర్-ఏఎన్నార్, శోభన్‌బాబు-కృష్ణ, కృష్ణ-కృష్ణంరాజు కాంబినేషన్లు అసలు సిసలు మల్టీస్టారర్లుగా ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఇప్పుడు యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు.
సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఇగో సమస్యలు ఉంటుంటాయని వింటుంటాం. కానీ మొదట్నుంచీ తారక్, చరణ్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఈ సినిమా కారణంగా సెట్స్ మీద పనిచేస్తున్నప్పుడు ఆ బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. అప్పట్నుంచీ ఒకరినొకరు ప్రశంసించుకోవడం, ప్రోత్సహించుకోవడం గమనిస్తూ వస్తున్నాం. "భీమ్ ఫర్ రామరాజు", "రామరాజు ఫర్ భీమ్" టీజర్లు ఇందుకు నిదర్శనం.
శనివారం రామ్‌చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతనికి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విషెస్ తెలియజేశాడు తారక్. చరణ్‌తో కలిసున్న ఓ అందమైన ఫొటోను అతను షేర్ చేశాడు. ఈ ఫొటోలో చరణ్ నిల్చొని తన గడ్డం పట్టుకొని నవ్వుతుంటే, అతని భుజం మీద తలవాల్చి కనిపిస్తున్నాడు తారక్. ఈ ఫొటో చాలు.. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి!
ఆ ఫొటోతో పాటు, "ఈ సంవత్సరం మనకు రిమార్కబుల్ కాబోతోంది. నీతో కలిసి గడిపిన క్షణాలను ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాను బ్రదర్. Many Happy Returns @alwaysramcharan." అని రాసుకొచ్చాడు తారక్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![]() |
![]() |