![]() |
![]() |
.jpg)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత గురించి కేవలం తమిళనాడు ప్రజలకే కాదు, యావద్దేశంలోని అనేకానేమందికి తెలుసు. తమిళ ప్రజానీకానికి అమ్మగా మారి, పురుషాహంకారాన్ని ప్రదర్శించిన ఉద్ధండ రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రెబల్‌గా జయలలిత పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆమె రాజకీయ జీవితంలో ప్రతిపక్షనాయకురాలిగా ఉన్నప్పుడు నిండు శాసనసభలో స్పీకర్ సాక్షిగా అధికార పార్టీ సభ్యులు ఆమె చీరలాగి అవమానించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, అదే ఘటన జయ రాజకీయ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఆ సీన్ జయలలిత బయోపిక్ 'తలైవి'లో ఓ కీలక ఘట్టం కాబోతోంది. అవును. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'తలైవి' ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాల 8 సెకన్ల నిడివి వున్న ఆ ట్రైలర్‌లో అసెంబ్లీలో జయ చీర లాగే సన్నివేశం కూడా ఉంది. ట్రైలర్‌లో ఆ సన్నివేశానికి తగిన ప్రాధాన్యం కూడా కనిపించింది.
"మహాభారతంలో ద్రౌపదికి కూడా ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరచిన ఆ కౌరవుల కథ ముగించి, జడను ముడేసుకొని శపథాన్ని నెరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది. జయ!" అంటూ కంగన రోషంతో, ఆగ్రహంతో, ఆవేశంతో చెప్పిన డైలాగ్ 'తలైవి' సినిమా ఎలా ఉండబోతోందో తెలియజేసింది.

ఈ మూవీలో ఎన్నో డైలాగ్స్ తూటాల్లాగా కనిపిస్తున్నాయి. "ఇది పోరాటం. ప్రజల కోసం పోరాటం. ప్రాణం పోయేవరకు పోరాడుతా.", "నన్ను అమ్మగా చూస్తే నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఓ ఆడదానిగా చూస్తే.." లాంటివి మచ్చుకు కొన్ని. విజయేంద్రప్రసాద్ కలం నుంచి ఆ డైలాగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు డైరెక్టర్ విజయ్‌తో కలిసి స్క్రిప్టును కూడా ఆయన అందించారు.
సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి అమ్మగా, తలైవిగా జయలలిత ఎలా ఎదిగారో 'తలైవి' మూవీ మన కళ్లకు కట్టినట్లు చూపించనున్నదని ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఎంజీఆర్ సరసన నటించేటప్పుడు ఆయనను జయలలిత ఎలా ఆకట్టుకున్నారో, ఆమెలో తన రాజకీయ వారసురాలిని ఎంజీఆర్ ఎలా చూశారో ఈ సినిమా మనకు తెలియజేయనున్నది. ఆమెను రాజకీయాల్లోకి తెచ్చిన ఎంజీఆర్ "నువ్వు ప్రజల్ని ప్రేమిస్తే.. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. అదే రాజకీయం." అని బోధించడం మనకు కనిపిస్తుంది. ఆయన మాటల్ని అనంతర కాలంలో జయ తూచా తప్పకుండా పాటించారు.
స్క్రీన్‌పై జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఉన్నత స్థాయిలో నటించినట్లు మూడు నిమిషాల ట్రైలర్‌తోనే తెలిసిపోతోంది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి ఒదిగిపోయి కనిపించారు. ఆ ఇద్దరి జోడీ కూడా స్క్రీన్ మీద చూడ చక్కగా ఉంది. జయలలిత కథకు విలన్ ఎవరో మనకు తెలుసు. ఆ కరుణానిధి పాత్రలో సముద్రకని నటించాడు. ఎంజీఆర్ భార్యగా మధుబాల కనిపించారు.

ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీగా ఉన్నాయనేది స్పష్టం. మొత్తం సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ ట్రైలర్ మాత్రం సూపర్బ్‌గా ఉందనేది నిజం. విజయ్ డైరెక్షన్ కూడా బాగుందనే అభిప్రాయం కలుగుతోంది. ఏప్రిల్ 23న 'తలైవి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
![]() |
![]() |