![]() |
![]() |

ఆధునిక టెక్నాలజీ సాయంతో వ్యవసాయాన్ని కెరీర్‌గా మలచుకోవచ్చుననే కథాంశంతో రూపొందిన 'శ్రీకారం' చిత్రాన్ని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మెచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాని ఆయన తిలకించారు. ఆ చిత్రాన్ని ఆద్యంతం ఆస్వాదించడమే కాకుండా, సినిమా చాలా బాగుందనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వ్యవసాయాన్ని చేపట్టి అన్నదాత ముందుకు వెళ్లవచ్చనే సందేశాన్ని ఇచ్చిందనీ ప్రశంసించారు. యువత చూడదగ్గ చిత్రమని తెలిపారు. సినిమా టీమ్‌ను అభినందించారు. తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా ఈ విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నారు.
"వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం." అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'శ్రీకారం'. కిషోర్ బి. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న విడుదలైంది.
ఉపరాష్ట్రపతి తమ విలువైన సమయాన్ని వెచ్చించి 'శ్రీకారం' చిత్రాన్ని చూసి, ఆ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తూ, యువత చూడదగ్గ చిత్రంగా ప్రశంసించడంతో సినిమా టీమ్ అంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
హీరో శర్వానంద్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఉపరాష్ట్రపతి ట్వీట్స్‌ను రిట్వీట్ చేసి, "Thank you so much sir.. Means a lot." అని ధన్యవాదాలు తెలిపారు. చిత్ర బృందం వెంకయ్యనాయుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
![]() |
![]() |