![]() |
![]() |

బాలీవుడ్‌లో 'మీటూ' ఉద్యమం ప్రకంపణలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే ఉద్యమం గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి వల్ల కోలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేసింది. ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై చిన్మయి 'మీటూ' ఆరోపణలు చేయడం, శంకర్, మణిరత్నం లాంటి వాళ్లు ఇలాంటి వ్యక్తిని ఎలా ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు గుప్పించడంతో చిన్మయి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ తరువాత నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ రాధారవిపై కూడా ఇదే తరహా మీటూ ఆరోపణలు చేసిన చిన్మయి వార్తల్లో నిలిచింది. అయితే ఈ విషయంలో తనని టార్గెట్ చేసిన తమిళ వర్గాలు తనని కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని తాజాగా వెల్లడించింది చిన్మయి. ఇలాంటి కష్టాలు తనని వెంటాడుతున్నా తన వెన్నంటి అర్థం చేసుకునే రాహుల్ లాంటి భర్త తనకు లభించడం తన అదృష్టమని చెబుతోంది. సమంతకు డబ్బింగ్ చెప్పడంతో పాటు పాపులర్ హిట్ గీతాలని ఆలపించడంతో వార్తల్లో నిలిచిన చిన్మయి ఇటీవల 'ఇండియా టుడే కాన్‌క్లేవ్'లో ముచ్చటించింది.
ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వెల్లడించింది. 'మీటూ' ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లని బయటపెట్టినందుకు 2018 అక్టోబర్ నుంచి రాధారవి, వైరముత్తు తనని కోలీవుడ్ పరిశ్రమ నుంచి బ్యాన్ చేశారని తెలిపింది. "రాధారవి నేతృత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది. దీనిపై నేను చట్టబద్ధంగా పోరాడుతున్నాను. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదు. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ వైరముత్తు, రాధారవి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు అనుభవిస్తున్నారు. దేవుడి దయవల్ల తెలుగు, హిందీ, ఇతర ఇండస్ట్రీల్లో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే భర్త, కుటుంబం వుండటం నా అదృష్టం. అండగా లేని మహిళల పరిస్థితేంటీ?" అని ప్రశ్నిస్తోంది చిన్మయి.
![]() |
![]() |