![]() |
![]() |

గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'కు హోస్ట్‌గా వ్యవహరించడం ద్వారా మరోసారి స్మాల్ స్క్రీన్‌పై అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇదివరకు ఆయన బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తన ముద్రను వేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' తరహాలో సాగే 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో ఇదివరకు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో నాలుగు సీజన్ల పాటు మా టీవీలో ప్రసారమైంది. మూడు సీజన్లకు నాగార్జున, నాలుగో సీజన్‌కు చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు టైటిల్‌లో చిన్న మార్పుతో జెమినీ టీవీలో ఈ షో మేలో ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా ఆ షో నిర్వాహకులు శనివారం ఏర్పాటు చేసిన షో లాంచ్ ఈవెంట్‌లో తారక్ మాట్లాడారు. దీన్నొక సవాలుగా తీసుకుంటున్నానని చెప్పారు.
"బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఒక కొత్త జర్నీ మొదలుపెడుతున్నాను. ప్రజలతో మమేకం అవడానికి, బుల్లితెరపై రావడానికి ఇదో కొత్త ప్రయాణం. జెమినీ టీవీతో, సన్ నెట్‌వర్క్‌తో అసోసియేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీ. ఈ జర్నీ మంచి మెమరబుల్‌గా ఉంటుంది ఆశిస్తున్నా. ప్రేక్షక దేవుళ్లందరూ నా ఈ కొత్త ప్రయాణాన్ని ఆశీర్వదించి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నా." అన్నారు తారక్.
ఈ షో చేయడానికి తనను ప్రేరేపించిందేమిటో ఆయన వెల్లడించారు. "కథ నచ్చి, కథనం నచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతాం. 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఒప్పుకోవడానికి ఆసక్తిగా అనిపించింది.. చాలా మంది ప్రజలను, అదీ రకరకాల నేపథ్యాల నుంచి వచ్చేవాళ్లను కలుసుకొనే అవకాశం ఉండటం. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లతోనే ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఈ షోలో జనంతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాం. రకరకాల ఎమోషన్స్‌తో ఉండే ప్రజల్ని కలుసుకొని, వారి జీవన విధానాన్ని, వాళ్ల జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకోవడానికి, ఒక మనిషి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందనేది నా ఉద్దేశం. నేను ఈ షో యాక్సెప్ట్ చేయడానికి కారణాల్లో అది ముఖ్యమైంది. అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
"ఈ షోలో చిరంజీవి గారు, నాగార్జున గారు తమవైన మార్క్‌ను క్రియేట్ చేశారు. కచ్చితంగా ఇది నాకో ఛాలెంజ్. చాలా వినమ్రంగా ఈ ఛాలెంజ్‌ను ఒప్పుకొని, నా వంతు కృషి నేను చేసి, నా వంతు మార్క్‌ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా." అని ఆయన చెప్పారు.
![]() |
![]() |