![]() |
![]() |

బెంగళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ యువహీరో తనీశ్ పై పలు చానెళ్లు కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన ఓ వీడియో ద్వారా ఖండించారు. "డ్రగ్స్ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారం ప్రచారం చేసేశారు. ఇందులో నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు కనీసం నన్ను సంప్రదించలేదు.. నా కుటుంబాన్ని ఆ వార్తలు తీవ్రంగా బాధించాయి." అంటూ వాపోయారు యువహీరో తనీశ్. "బెంగళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజం. నాకూ నోటీసు వచ్చింది. కానీ నాకు వచ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ప్రచారం చేయడం నా కుటుంబాన్ని బాధించింది." అని తనీష్ అన్నారు. అసలు బెంగళూరు నిర్మాతతో రెండేళ్లుగా ఎలాంటి సంప్రదింపులు లేవని తెలిపారు.
"ఈ కేసులో నాకు వచ్చిన నోటీసుకు కారణం వేరు. ఫలానా వివరం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి!.. అని మాత్రమే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యానని నోటీస్ పంపలేదు.. ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారం కథనాలు అల్లేశాయి. నేను నా కుటుంబం చాలా కలతకు గురయ్యాం. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయొద్దు. బెంగళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గతంలో సంప్రదించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. రెండేళ్లుగా ఆయనతో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. అవకాశాల కోసం ఎందరినో కలుస్తుంటాం. అభ్యర్థిస్తుంటాం. కానీ ఆయనతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు." అని తనీష్ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. దయచేసి అసత్యాలు ప్రచారం చేయొద్దని కోరారు.
"మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పటికే ఇలాంటి బాధాకర ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అప్పుడు ఏం లేదని తేలింది. కానీ ఆ ట్రామాను నేను, నా ఫ్యామిలీ ఫేస్ చేశాం. అదే ట్రామా మళ్లీ నా ఫ్యామిలీ ఎలాంటి కారణం లేకుండా ఫేస్ చేస్తుందంటే దాన్ని నేను భరించలేను. నేను 22 సంవత్సరాల నుంచీ ఇండస్ట్రీలో ఉన్నా. మీడియాతో చిన్నప్పట్నుంచీ కలిసే ఉన్నా. ఇలా ఫేక్ న్యూస్ వేసి, ఇండియా లెవల్లో నన్నొక డాన్ లాగా క్రియేట్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. నేను క్లారిటీ ఇచ్చాక కూడా ఇలాంటి న్యూస్‌ను వ్యాప్తి చేస్తుంటే, అది నా ఫ్యామిలీని టార్చర్ చేస్తుందంటే చట్టపరంగా వెళ్లడం కంటే నేను చేయగలిగేదేమీ ఉండదు. ఈ అసత్య వార్తలు చూసి బాధపడవద్దని నా అభిమానులను, నా శ్రేయోభిలాషులను కోరుతున్నా." అని తనీశ్ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |