![]() |
![]() |
"మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతల్ని గెలవాలి.", "ప్రేమించినోడితో పెళ్లి చేయకుండా పెళ్లి చేసినోడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం." అనే డైలాగ్స్‌తో ఆ క్యారెక్టర్ ఏమిటనేది ఊహించవచ్చు. ఈ డైలాగ్స్ చెప్పింది హీరో కాబట్టి అతడి క్యారెక్టర్ అర్థమవుతోంది. ఇవి శశి సినిమా ట్రైలర్‌లో ఆది సాయికుమార్ నోట వచ్చిన డైలాగ్స్.
ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శశి'. సురభి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మార్చి 19న విడుదలవుతోంది.
ఈరోజు 'శశి' ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంచ్ చేశారు. ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉందనీ, సినిమా కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆశిస్తున్నాననీ ఆయన అన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
"మనం ప్రేమించేవాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది" అని హీరో చెప్తుండగా ట్రైలర్ ప్రారంభమైంది. అంతలోనే ప్రమాదం జరిగి, అతని ప్రియురాలు హాస్పిటల్ పాలయినట్లు తెలుస్తోంది.
"శశి అంటే రెండక్షరాలు కాదు వాడికి. మనమిద్దరం. ఏ ఒక్కరు లేకపోయినా తట్టుకోలేడు." అని హీరో లవర్‌తో ఫ్రెండ్ చెప్పడాన్ని బట్టి హీరోకు ఫ్రెండ్, ప్రియురాలు తప్ప లోకంలో ముఖ్యమైన విషయాలు లేవని అర్థమవుతుంది. సో.. శశి అంటే ఒక్కరు కాదనీ, ఇద్దరనీ తెలుస్తోంది.
అప్పటి దాకా ఒక రకం లుక్‌తో లవర్ బాయ్‌లా కనిపించిన హీరో, ఆ తర్వాత గడ్డం పెంచేసి భిన్నమైన లుక్‌లో దర్శనమిచ్చాడు. దాని వెనుక ఏదో కథ ఉందనీ, అది ఎమోషనల్ ఎలిమెంట్‌తో ముడిపడి ఉందనీ అర్థమవుతోంది. ఓవరాల్‌గా 'శశి' అనేది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా ట్రైలర్ మనకు స్పష్టం చేస్తోంది.
హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్‌లో ఆది సాయికుమార్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన బలమని ఈజీగా గ్రహించవచ్చు. ఇదివరకెప్పుడూ ఈ తరహా క్యారెక్టర్‌లో ఆయన కనిపించలేదు. ట్రైలర్ చూస్తే, యాక్షన్ సీన్లలోనూ ఆయన విజృంభించి నటించినట్లు కనిపిస్తోంది. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్‌కు కొదవలేదు.
సురభి చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కేవలం గ్లామర్‌కు పరిమితమైంది కాదనీ, కథకు ఆమె క్యారెక్టర్ చాలా కీలకమైందనీ తెలుస్తోంది. ట్రైలర్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్‌తో పాటు యాక్షన్ సీన్లు కూడా ఇంప్రెసివ్‌గా అనిపిస్తున్నాయి.
రాజీవ్ కనకాల, జయప్రకాశ్, అజయ్, వెన్నెల కిశోర్, రాశీ సింగ్, తులసి ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకు ఐ. రవి డైలాగ్స్ రాయగా, అరుణ్ చిలువేరు మ్యూజిక్ సమకూర్చారు. అమరనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా, రియల్ సతీశ్ ఫైట్స్‌కు రూపకల్పన చేశాడు.

![]() |
![]() |