![]() |
![]() |

అల్లరి నరేశ్ హీరోగా నటించిన 'నాంది' మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ రావడంతో ఆయన సినిమాల మార్కెట్ వాల్యూ బాగా పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 2.5 కోట్లే పలికాయి. ఫిబ్రవరి 19న 'నాంది'తో పాటు మరో మూడు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
ట్రేట్ విశ్లేషకుల లెక్కల ప్రకారం 'నాంది'కి తొలిరోజు రూ. 45 లక్షల షేర్ వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులో 18 శాతం రికవర్ అయ్యిందన్న మాట. నైజాంలో రూ. 18 లక్షలు, ఆంధ్రాలో సుమారు 21 లక్షలు, రాయలసీమలో 6 లక్షలు వచ్చాయి. మార్నింగ్ షోకు థియేటర్ల దగ్గర చాలా తక్కువ మంది ప్రేక్షకులు కనిపించగా, మౌత్ టాక్‌తో మ్యాట్నీ నుంచి క్రమంగా వసూళ్లు పెరిగాయి. శుక్రవారం పలుచోట్ల వర్షాలు పడటంతో, దాని ప్రభావం ప్రేక్షకుల రాకమీద పడింది. అందువల్ల వసూళ్లు కాస్త తగ్గాయి. వర్షం పడనట్లయితే రూ. 50 లక్షలు ఈజీగా క్రాస్ చేసేదని విశ్లేషకులు తెలిపారు.
'నాంది'లో అండర్ ట్రయల్ ఖైదీ బండి సూర్యప్రకాశ్ క్యారెక్టర్‌లో నరేశ్ ప్రదర్శించిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకులు అతని నటనకు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇది పాజిటివ్ టాక్ రావడానికి దోహదం చేసింది. నెరేషన్‌లో డైరెక్టర్ టెంపో మెయిన్‌టైన్ చేసినట్లయితే, సినిమా మరింత ఉత్కంఠభరితంగా ఉండేదని జనం అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రెగ్యులర్ కామెడీ సబ్జెక్టును కాకుండా, ఒక విలక్షణమైన సబ్జెక్టును ఎంచుకున్న నరేశ్ చాలా కాలం తర్వాత ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు.
![]() |
![]() |