![]() |
![]() |

అప్సరా రాణి మరో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. రవితేజ-గోపీచంద్ మలినేని బ్లాక్‌బస్టర్ మూవీ 'క్రాక్'లో "భూమ్ బద్దల్ సాంగ్"లో డాన్స్ చేసి, మాస్ ఆడియెన్స్‌ను అలరించిన అప్సరా రాణి, లేటెస్ట్‌గా గోపీచంద్‌తో ఓ ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న 'సీటీమార్' మూవీలో ఆమె ఈ సాంగ్ చేయనుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్వయంగా తెలియజేశాడు సంపత్ నంది.
"సీటీమార్ కోసం మరో బొంబాట్ ఐటమ్ నంబర్ చేయడానికి పటాఖా రాణి అప్సరా రాణికి స్వాగతం. ఈ ఐటమ్ చాలా కాలం మీకు గుర్తుంటుందని హామీ ఇస్తున్నాను." అని ఆయన ట్వీట్ చేశాడు. దాంతో పాటు ఆమె పిక్చర్‌ను కూడా షేర్ చేశాడు. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న 'సీటీమార్'లో గోపీచంద్, తమన్నా కోచ్‌లుగా నటిస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, భూమికా చావ్లా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
డెహ్రాడూన్‌లో పుట్టిన అప్సరా రాణి అసలు పేరు అంకితా మహారాణా. 2019లో '4 లెటర్స్' అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె, ఆర్జీవీ సినిమాలు 'థ్రిల్లర్', 'డేంజరస్' ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. రవితేజతో కలిసి 'క్రాక్'లో చేసిన "భూమ్ బద్దల్" ఐటమ్ నంబర్ ఆమెకు క్రేజ్ తెచ్చింది.

![]() |
![]() |