![]() |
![]() |

"ఇక్కడికి ఒక నటుడిగా రాలేదు. రోడ్డు ప్రమాదంలో మా కుటుంబంలో ఇద్దర్ని కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను. ముందు మా అన్నగారు జానకీరామ్. తర్వాత మా నాన్న నందమూరి హరికృష్ణగారు." అంటూ భావోద్వేగానికి గురయ్యారు జూనియర్ ఎన్టీఆర్. సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను బుధవారం తారక్ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పౌరులందరూ రోడ్డు ప్రమాదాలకు గురవకుండా ఉండాలంటే బాధ్యతాయుతంగా తమను తాము మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
"మా అన్నయ్య జానకీరామ్‌గారు జాగ్రత్తపరుడు. మేమైనా చిన్నతనంలో కొంచెం నిర్లక్ష్యంగా కారుని కానీ, బైక్‌ని కానీ రెక్‌లెస్‌గా నడిపినప్పటికీ, ఆయన మాత్రం ఎంతో జాగ్రత్తపరుడు. ఆయన జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ, రాంగ్ రూట్‌లో నేషనల్ హైవేపైన ఒక ట్రాక్టర్ రావడం వల్ల, దాన్ని నడిరోడ్డుపై అర్ధంతరంగా ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురై మరణించారు. రెండో ప్రమాదం మా నాన్నగారు నందమూరి హరికృష్ణగారు. అందరికీ తెలిసిన విషయమే. 33 వేల కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో జాగ్రత్తగా ఒక్క ప్రమాదం జరగకుండా పర్యటించేలా చేసిన జాగ్రత్తపరుడు మా నాన్నగారు. అలాంటి వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదానికి గురై, అర్ధంతరంగా మా అందరినీ వదిలేసి వెళ్లిపోయారు." అని తారక్ భావోద్వేగంతో చెప్పారు.

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. "ఇంట్లో నుంచి మీ వాహనంలో బయటకు వచ్చినప్పుడు మీ కుటుంబసభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీరు తిరిగివచ్చేదాకా మీ భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, మీ మీద ఆధారపడ్డవాళ్లంతా మీకోసం ఎదురుచూస్తుంటారు. కఠినమైన రూల్స్ ఉంటేనో, కఠినమైన శిక్షలు ఉంటేనో మనం మారం. కరోనా లాంటి భయంకరమైన మహమ్మారికి కూడా వ్యాక్సిన్ ఉంది కానీ, రోడ్డు ప్రమాదాలకు గురవకుండా ఉండటానికి వ్యాక్సిన్లు లేవు. మనం బాధ్యతాయుతంగా మెలగాలి. మనల్ని మనం మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు మార్చుకోండని పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా." అన్నారు తారక్. అందరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు.

![]() |
![]() |