![]() |
![]() |

"అన్నిటికన్నా సంకల్పం గొప్పది.. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు.. తప్పు చేయనంతవరకు దేన్నైనా ఎదిరించొచ్చు.." అనే పాయింట్ తో రూపొందిన చిత్రం 'మురారి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో మేలిమలుపుగా నిలిచిన ఈ సినిమాలో అతనికి జోడీగా సోనాలి బింద్రే నటించింది. తెలుగులో సోనాలి తొలి స్ట్రయిట్ పిక్చర్ ఇదే కావడం విశేషం.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో లక్ష్మి, సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి, ధూళిపాల (చివరి చిత్రం), అన్నపూర్ణ, సుధ, హేమ, రఘుబాబు, రవిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు అతిథి పాత్రల్లో మెరిశారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. "అలనాటి రామచంద్రుడికన్నింట సాటి.. ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నింట మేటి.." గీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటి (లక్ష్మి), స్పెషల్ జ్యూరీ (మహేశ్ బాబు) విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్న ఈ సినిమాని.. ఎన్. రామలింగేశ్వరరావు సారథ్యంలో రాంప్రసాద్ ఆర్ట్స్ బేనర్ పై నందిగం దేవీప్రసాద్ నిర్మించారు. 2001 ఫిబ్రవరి 17న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'మురారి'.. నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |