![]() |
![]() |

ప్రస్తుతం క్లౌడ్ 9లో ఉన్న డైరెక్టర్ ఎవరంటే గోపీచంద్ మలినేని పేరే చెప్తారు ఎవరైనా. రవితేజ్ హీరోగా అతడు రూపొందించిన 'క్రాక్' బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది మరి! అంతేకాదు.. లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నాక ఇండియాలోనే ఘన విజయం సాధించిన తొలి సినిమాగానూ అది నిలిచింది. రవితేజ ఫ్లాపుల పరంపరకు తెరదించిన ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్నాడు గోపి. వెంటనే తన తదుపరి సినిమాకి అతడినే డైరెక్టర్‌గా ఎంచుకున్నాడు బాలకృష్ణ.
డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన పదకొండేళ్లకు తొలి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు గోపీచంద్. శ్రీను వైట్ల, మురుగదాస్ లాంటి డైరెక్టర్ల దగ్గర పనిచేసి, 2010లో రవితేజ హీరోగా నటించిన 'డాన్ శీను'తో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు గోపి. ఆ సినిమా హిట్. దాంతో వెంకటేశ్ దృష్టిలో పడి, 'బాడీగార్డ్' మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ చేజిక్కించుకున్నాడు. 2012లో వచ్చిన ఆ సినిమా యావరేజ్‌గా ఆడింది. మహేశ్ 'బిజినెస్‌మ్యాన్' సినిమా కనుక పోటీకి రాకపోతే అది కూడా హిట్టయ్యేదే.
మూడో సినిమాని మళ్లీ రవితేజతోటే తీశాడు గోపి. మళ్లీ హిట్. ఆ సినిమా 'బలుపు'. నాలుగో సినిమాని రామ్ హీరోగా 'పండగ చేస్కో' టైటిల్‌తో తీశాడు. అది ఆశించిన రీతిలో ఆడలేదు. ఐదో సినిమాని 2017లో సాయిధరమ్ తేజ్‌తో తీశాడు. అది.. 'విన్నర్'. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్. దీంతో ఏకంగా మూడేళ్ల విరామం తీసుకొని తిరిగి రవితేజతోటే సినిమా తీశాడు. తనకు బాగా తెలిసిన ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒకప్పటి రౌడీ షీటర్ కఠారి కృష్ణ జీవితాన్ని పరిశోధించి, దానికి కొంత కాల్పనికతను జోడించి 'క్రాక్' తీశాడు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఇటు హిట్టూ వచ్చింది, అటు కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టరూ దక్కింది. అచ్చొచ్చిన హీరోతో ఈసారి ఏకంగా కెరీర్ బెస్ట్ సాధించాడు గోపి. ఎక్కడా బోర్ కొట్టించకుండా, సినిమాని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించి ఈ విజయాన్ని అందుకున్నాడు. ఈ బ్లాక్‌బస్టర్ పునాదిగా గోపి తన కెరీర్‌ను ఎలా నిర్మించుకుంటాడో వెయిట్ అండ్ సీ...
![]() |
![]() |