![]() |
![]() |

పలు చిత్రాల్లో రౌడీ పాత్రలతో హాస్యాన్ని పండించి, ప్రేక్షకులకు ఆహ్లదాన్ని పంచిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన హైదరాబాద్, సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు మైలా నర్సింగ్ యాదవ్. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు.
విజయనిర్మల దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ హీరోలుగా నటించిన 'హేమాహేమీలు' (1979) చిత్రంలో బాల నటుడిగా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. క్షణ క్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ 'బాషా'లో నర్సింగ్ యాదవ్ కనిపించారు. చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'లోనూ ఆయన నటించారు. తొలినాళ్లలో తను డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలో నర్సింగ్ యాదవ్‌కు రామ్‌గోపాల్ వర్మ అవకాశాలిచ్చారు.
కొంత కాలం క్రితం మూత్రపిండాలు పాడవడంతో, అప్పట్నుంచీ నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ జరుగుతోంది. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతికి టాలీవుడ్ వర్గాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి.
![]() |
![]() |