![]() |
![]() |

ఈ మాటలన్నది ఎవరనుకుంటున్నారు.. రజనీకాంత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడైన మోహన్‌బాబు! అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయం తీసుకుంటున్నాననీ, ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలనీ మంగళవారం సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రకటన ఆయన అభిమానుల్లో చాలామందికి రుచించలేదు. ఆయన నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేయడమే కాకుండా, ఆయన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పలువురు సెలబ్రిటీలు మాత్రం రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రాజకీయాలకంటే ఆరోగ్యమే ముఖ్యమనీ, తన ఆరోగ్య స్థితి రీత్యా రజనీ సరైన నిర్ణయమే తీసుకున్నారనీ వారు ఆయనను అభినందిస్తున్నారు.
తాజాగా మోహన్‌బాబు సైతం తన ప్రాణమిత్రునికి మద్దతుగా నిలిచారు. గురువారం వెలువరించిన ఓ ప్రకటనలో ఏం చెప్పారంటే...
"రజనీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా పాలిటిక్స్‌లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ, ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను.. నువ్వు చాలా మంచివాడివి, చీమకు కూడా హాని చేయనివాడివి, నా దృష్టిలో ఒన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీలాంటి వ్యక్తికీ, నాలాంటి వ్యక్తికీ రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే.. మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం, ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము, కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంతవరకు మంచివాడివి అన్న నోళ్లే, రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి.
రాజకీయం ఒక రొచ్చు.. ఒక బురద.. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది.
రజనీకాంత్ అభిమానులందరూ రజనీకాంత్ అంత మంచివాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ... మీ మోహన్‌బాబు" అని ఆయన చెప్పారు.
![]() |
![]() |